ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!

21 Aug, 2015 01:37 IST|Sakshi
ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!

బస్సు చార్జీలపై ప్రభుత్వానికి నివేదించనున్న టీఎస్‌ఆర్టీసీ
* 12 శాతం నుంచి 15 శాతం మధ్య పెరిగే అవకాశం?
వేతన సవరణ భారం నుంచి బయటపడేందుకు మేధోమథనం
* ఉన్నతాధికారులతో ఉదయం నుంచి రాత్రి వరకు జేఎండీ మంతనాలు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్సు చార్జీలను ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది.

గతేడాదితో పోల్చితే నష్టాలు తగ్గినప్పటికీ, ఇటీవల ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచడం  టీఎస్‌ఆర్టీసీకి భారంగా మారింది. జూలై నెలలో పుష్కరాల రూపంలో రూ.30 కోట్లు అదనపు ఆదాయం సమకూరినప్పటికీ వేతనాల పెంపు కారణంగా ఇంకా రూ.32 కోట్ల నష్టంలోనే ఉండిపోయింది. ఇక ప్రతినెలా ఇదే పరిస్థితి ఎదరుకానుండడంతో బస్సు ఛార్జీల పెంపు తప్పదని అధికారులు నిర్ణయానికొచ్చారు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోన్న ఏపీఎస్‌ఆర్టీసీ చార్జీలు పెంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది.

అక్కడ 12 నుంచి 15 శాతం వరకు చార్జీలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీలో ఛార్జీలు ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. చార్జీల పెంపులో తేడాలు ఉంటే రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు చార్జీలలో తేడాలు ఉండి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపులో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
 
ఓఆర్ 70 శాతం ఉండాలి: అధికారులకు జేఎండీ ఆదేశాలు
ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో జేఎండీ రమణరావు ఈడీలు, ఆర్‌ఎంలతో మేథోమథన సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ సమావేశంలో అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడంతోపాటు వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు. ఇకనుంచి ప్రతినెలా పరిస్థితిని సమీక్షించేందుకు ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

సామాజిక అవసరంగా పల్లెవెలుగు బస్సులు నిర్వహిస్తున్నందున వాటి నుంచి వచ్చే నష్టాలను ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లగ్జరీ తదితర ఇతర రకాల బస్సుల ద్వారా సర్దుబాటు చేయాలని జేఎండీ పేర్కొన్నారు. ఇందుకోసం ఆ కేటగిరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 70 శాతానికి తగ్గకుండా కచ్చితంగా చూడాలని ఆదేశించారు. అంతకంటే తక్కువ ఓఆర్ ఉన్న మార్గాలను గుర్తించి వెంటనే సమీక్షించి ఎలాంటి మార్పుచేర్పులు చేస్తే అవి 70 శాతంపైకి చేరుతాయో గుర్తించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అతి తక్కువ ఓఆర్ ఉన్న సర్వీసులను వేరే చోటకు మళ్లించాలన్నారు. ఇంధన వృథాను అరికట్టి ఇతర ఖర్చులను నియంత్రించాలని పేర్కొన్నారు.
 
కనీస భారం రూ.410 కోట్లు...
టీఎస్‌ఆర్టీసీ పరిధిలో నిత్యం రూ.9.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఏడాదికి ఈ మొత్తం రూ.3,420 కోట్లు. జరుగుతున్న ప్రచారం ప్రకారం 12 శాతం చార్జీలు పెంచితే ప్రజలపై రూ.410 కోట్ల మేర భారం పడుతుంది. ఆదే 15 శాతం పెంచితే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది. ఇదిలాఉండగా, పల్లె వెలుగును పెంపునుంచి మినహాయించాలని దాదాపు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు