'సభ్యుల ఆందోళనలతో 15వ లోక్సభ వృధా అయింది'

13 Feb, 2014 09:49 IST|Sakshi
దిగ్విజయ్ సింగ్

15వ లోక్సభలో సభ్యుల ఆందోళనలతో అత్యధిక సభా సమయం వృధా అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభకు ఎన్నికైన వారు సభలో హుందాగా ప్రవర్తించాలని ఆయన సభ్యులకు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు విశ్వాసం కోల్పోతే ఎవరు బాధ్యులంటూ ఆయన లోక్సభ సభ్యులను ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆందోళన చెందారు. ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం ఉంచేలా నడుచుకునే బాధ్యత పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులందరిపై ఉందని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. గురువారం ట్విట్టర్లో దిగ్విజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.



2009లో యూపీఏ -2 పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. దాంతో ఇటు స్వపక్షం, అటు విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అందులోభాగంగా లోక్సభ సభ్యులు సభలో ఆందోళనలకు దిగడం, నిరసనలు తెలపడం, సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్సభ సభ్యులు యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు.

 

దాంతో ఆ ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ సస్పెన్షన్ సదురు ఎంపీలు స్వాగతించారు. అంతేకాకుండా బుధవారం లోక్సభ వెల్లోకి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు, కేంద్ర మంత్రులు వెల్లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సోనియా మాటలను కూడా బేఖాతర్ చేసి అందరు లోక్సభలో ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.

 

అయితే గురువారం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీంతో లోక్సభలో తమ నిరసనలు మరింత ఉదృతం చేసేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులు సమాయత్తమైయ్యారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. 

మరిన్ని వార్తలు