అమ్మాయి బురఖా ధరించి వచ్చిందని..

15 Jan, 2017 15:24 IST|Sakshi
అమ్మాయి బురఖా ధరించి వచ్చిందని..

వాషింగ్టన్‌: అమెరికాలో బురఖా ధరించిన ముస్లిం మహిళలపై వివక్ష కొనసాగుతోంది. బురఖా ధరించిన మహిళలను.. విమానం, బస్సులలో నుంచి దించివేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం వంటి సంఘటనల గురించి విన్నాం. తాజాగా ఉటావ రాష్ట్రం ప్రొవో నగరంలో ఓ విద్యార్థిని బురఖా ధరించి వచ్చినందుకు స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ ఆ అమ్మాయిని బస్సులోంచి దించివేసి వెనక్కిపంపాడు. జన్నా బకీర్‌ అనే 15 ఏళ్ల బాలికకు రెండు సార్లు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

బాధిత బాలిక టింప్వ్యూ హైస్కూల్లో చదువుతోంది. బురఖా ధరించడం మత సంప్రదాయమని, తాను ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు ఇలాగే వెళ్తానని, స్కూల్‌ డ్రెస్‌తో పాటు బురఖా వేసుకుని వెళ్లినందుకు బస్ డ్రైవర్‌ తనను దించివేశాడని బకీర్‌ ఆరోపించింది. డ్రైవర్‌ తనను అవమానించేలా మాట్లాడాడని, బాధతో ఏడ్చానని చెప్పింది. ఈ ఘటనపై స్కూల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని బకీర్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. వారు న్యాయవాదిని ఆశ్రయించారు.

ఈ ఘటనపై స్కూల్‌ ప్రతినిధి స్పందిస్తూ.. విద్యార్థులు వారికి కేటాయించిన బస్సుల్లో మాత్రమే స్కూల్‌కు రావాలని, బకీర్‌ మాత్రం వేరే బస్సులో ఎక్కిందని వివరించారు. ఈ ఘటనపై తాము విచారణ జరిపామని, బస్‌ డ్రైవర్ ఈ అమ్మాయిని కించపరిచేలా మాట్లాడలేదని చెప్పారు. బకీర్‌ మిడిల్‌ స్కూల్‌ నుంచి బస్సుల్లో ప్రయాణిస్తోందని, ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురుకాలేదని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాక బురఖా ధరించిన మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు