2,758 కోట్లకు హోమియో మార్కెట్

19 Jun, 2015 02:20 IST|Sakshi
2,758 కోట్లకు హోమియో మార్కెట్

♦ ఇందులో సంఘటిత రంగం వాటా
♦ కేవలం రూ.270 కోట్లు
♦ దీర్ఘకాలిక వ్యాధులను కూడానయం చేయొచ్చు
డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి వైద్యానికి డిమాండ్ ఉందని, కేన్సర్, రక్తనాళాల వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాలకు సైతం హోమియోపతి వైద్యంలో చికిత్స ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా చెప్పారు. దేశంలో హోమియోపతి మార్కెట్ రూ.2,758 కోట్లకు చేరిందని.. కాకపోతే ఇందులో సంఘటిత రంగం వాటా కేవలం రూ.270 కోట్లని.. మిగతాదంతా అసంఘటిత రంగానిదేనని చెప్పారాయన. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రూప్ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. ఇంకా ఏమన్నారంటే...

► ప్రస్తుతం డాక్టర్ బాత్రాస్‌కు దేశంలో 200, దుబాయ్‌లో 3, లండన్‌లో 2, ఢాకాలో ఒకటి చొప్పున క్లినిక్‌లు ఉన్నాయి. ఇందులో 140 సొంతవి కాగా మిగతావి ఫ్రాంచైజీ. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో మరో 51, విదేశాల్లో 11 క్లినిక్స్‌ను తెరుస్తాం. 2020 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌తో మొత్తం 450 క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. రెండు నెలల్లో గల్ఫ్ దేశాల్లో మరో 5 క్లినిక్స్‌ను ప్రారంభిస్తాం.

► ఈ ఏడాది రూ.25 కోట్ల పెట్టుబడితో క్లినిక్స్, స్టోర్లను ప్రారంభించనున్నాం. మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. గతేడాదితో పోల్చితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధి రేటుతో రూ.200 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతంగా ఉంది. మొత్తం టర్నోవర్‌లో డాక్టర్ బాత్రాస్ వాటా 78 శాతం, హెయిర్ ట్రీట్‌మెంట్, ఎఫ్‌ఎంసీజీ విభాగాల వాటా 22 శాతంగా ఉంది.

► గతేడాది డాక్టర్ బాత్రాస్ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతానికి  షాంపూ, జుట్టు, చర్మ సంబంధిత చికిత్సలకు సంబంధించి 38 ఉత్పత్తులున్నాయి. స్టోర్ల విషయానికొస్తే మన దేశంలో 6,500, దుబాయ్‌లో 220 ఉన్నాయి. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని చేశాం.

► హోమియోపతి రంగంలో లక్ష మంది వైద్యులు, 100 మిలియన్ల మంది చికిత్స పొందుతున్నారు. దశాబ్ద కాలంలో డాక్టర్ బాత్రాస్ గ్రూప్‌లో 1.3 మిలియన్ల మంది చికిత్స చేయించుకున్నారు. ఇందులో 60% వాటా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కస్టమర్లదే.

మరిన్ని వార్తలు