20% పెరిగిన లైసెన్సు ఫీజు

12 Sep, 2015 09:09 IST|Sakshi
20% పెరిగిన లైసెన్సు ఫీజు

రెండేళ్ల కాలపరిమితితో కొత్త మద్యం విధానం
2,216 మద్యం దుకాణాలకు త్వరలో దరఖాస్తులు
జనాభా ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో కేటాయింపు
ఒకేసారి లేదా 6 వాయిదాల్లో చెల్లింపునకు అవకాశం
టర్‌లో అత్యధికంగా 2.16 కోట్లు లెసైన్సు ఫీజు
దరఖాస్తు ఫారం ధర రూ.50 వేలకు పెంపు
పివిలేజి ఫీజు 8 శాతానికి తగ్గింపు
2015 అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు ఇదే విధానం
ఈనెల 14న దుకాణాలకు నోటిఫికేషన్, 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, 23న డ్రా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం మూడు జీవోలు (163, 164, 165) విడుదలయ్యాయి. ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను విక్రయించనున్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి... 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయిస్తారు.
 
ఒకేసారి 20 శాతం..
రెండేళ్ల కాలపరిమితితో మద్యం లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... లెసైన్సు ఫీజును ఒక్కసారిగా 20 శాతం పెంచేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు అదనంగా 20 శాతం పెంచుతూ ఈ కొత్త ఫీజులను నిర్ణయించారు. రెండేళ్లకు ఏటా 10 శాతం పెంచాలని తొలుత భావించినా... వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకేసారి పెంచారు.

ఈ లెక్కన 10 వేల జనాభా ఉన్న గ్రామం, పట్టణం, నగర పంచాయతీల్లో లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.78 లక్షలు కాగా... 20 లక్షలపైన జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీలో లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లు. ఇక మద్యం అమ్మకాలు లెసైన్సు ఫీజు మొత్తం కన్నా ఏడు రెట్లు దాటితే ప్రస్తుతం అదనంగా 13.6 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా... కొత్త విధానంలో రెండేళ్లకుగాను 8 శాతంగా నిర్ణయించారు. అంటే రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే... తర్వాతి అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫారం వెలను రూ.25వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.
 
మరిన్ని నిబంధనలు
* టర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణం లెసైన్సు ఫీజు కూడా ఆ కార్పొరేషన్ ధరకే కేటాయిస్తారు. ఉదాహరణకు జీహెచ్‌ఎంసీలో ఉప్పల్, కాప్రా వరకే కార్పొరేషన్ పరిధి. కానీ అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఘట్‌కేసర్‌లోని మద్యం దుకాణాలను కూడా జీహెచ్‌ఎంసీ ధరకే కేటాయిస్తారు.
* మున్సిపాలిటీల సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని మద్యం దుకాణాలకు... నగర పంచాయతీల నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
* లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచిన నేపథ్యంలో మద్యం దుకాణాలను ఎవ రూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్/ ఏజెన్సీ ద్వారా ఆ ప్రాంతాల్లో మద్యం వ్యాపారం జరుపుతారు.
* పతి ఎ-4 షాపులో హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ లేబుల్స్ (హెచ్‌ఈఏఎల్)ను డీకోడ్ చేసే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
* మద్యం సేవించడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ప్రజలను చైతన్యం చేయాలి.
* గుడుంబాను అణచివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చర్యలు చేపట్టాలి.
* గతంలో జూలై నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరాన్ని.. ఇక నుంచి అక్టోబర్‌కు మారుస్తూ నిర్ణయం.
* విద్యాసంస్థలు, దేవాలయాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి.
* హైవేలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి.
* మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూంల లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.4లక్షలు. ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించవచ్చు.
* మద్యం దుకాణంలో బాటిళ్ల స్టోరేజ్ కోసం ప్రత్యేక ఎ-4(జీ) లెసైన్సుతో గోదాం ఏర్పాటు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు