2006 కేసులో కేసీఆర్‌ను విచారించిన సీబీఐ

22 Oct, 2015 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ ఆయనను విచారించింది. నిర్మాణ కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కేటాయించిన ఈ కేసులో దర్యాప్తు సంస్థ సోమవారం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. 2006లో యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టు ఇచ్చారన్నాయి.

నిర్మాణ పనుల్లో నాణ్యత లేదంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించడంతో ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) 2007-08లో విచారణ చేపట్టిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నాసిరకం పనుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అనుమానిస్తున్నట్లు చెప్పాయి. ఈ కేసులో ఏపీ ఫిషరీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆయన ఇప్పటికే భారీగా అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్‌కు ప్రైవేటు కార్యదర్శిగా ఉన్న నాటి ఈఎస్‌ఐసీ డెరైక్టర్ జనరల్, కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్‌ను కూడా సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా