24మంది ఎమ్మెల్యేలు జంప్‌!

8 Jun, 2017 07:58 IST|Sakshi
24మంది ఎమ్మెల్యేలు జంప్‌!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ హైడ్రామాను తలపిస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్‌ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అధికారిక అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మను దూరం చేసి.. ఏకాకిని చేసేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండగా.. అందుకు విరుద్ధంగా దినకరన్‌ బలం నానాటికీ పెరుగుతుండటం గమనార్హం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా దినకరన్‌కు మద్దతు పలుకుతుండటం గమనార్హం. మంగళవారం రాత్రి వరకు దినకరన్‌కు మొత్తం 24మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఎడపాడి వర్గంలో ఉన్న 123 మంది ఎమ్మెల్యేల్లో 24మంది జారుకున్నట్టు అయింది. ఈ పరిణామాలతో లోలోపల ఖుషీ అవుతున్న ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఎడపాటి ప్రభుత్వం కూలిపోతుందని అంచనాలు వేస్తున్నారు. 
 
అన్నాడీఎంకే అధికారిక గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టైన దినకరన్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం సోమవారం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళను కలిశారు. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. సోమవారాం రాత్రి అతను చెన్నైలోని తన నివాసానికి చేరుకొనే సమయంలో ఆయనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మంగళవారం రాత్రి నాటికి ఏకంగా 24మంది ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరి.. మన్నార్‌గుడి మాఫియాకు మద్దతు పలికారు. దీంతో స్వరం పెంచిన దినకరన్‌ ఇప్పటికే పార్టీ అధినేత్రి శశికళేనని, ఆమె గైర్హాజరీలో పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని తేల్చిచెప్పారు. పార్టీలోని ఫ్యాక్షన్‌ గొడవలకు రెండు నెలల్లో చరమగీతం పాడాలని సూచించారు. 
 
మరోవైపు బొటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎడపాటి వర్గంలో తాజా పరిణామాలతో కలవరం మొదలైంది. మరింత ఎమ్మెల్యేలు జారుకుంటే అన్నాడీఎంకే పూర్తిగా దినకరన్‌ చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ఎడపాటి వర్గం భావిస్తున్నది. ఎమ్మెల్యేలు దినకరన్‌ వైపు వెళ్లకుండా ఎడపాటి చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దగా సఫలం కావడం లేదని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు