కశ్మీర్ లో 250మంది ఉగ్రవాదులు!

11 Oct, 2016 08:13 IST|Sakshi
కశ్మీర్ లో 250మంది ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ: దాదాపు 250మందికి పైగా ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలో నక్కి ఉన్నట్లు భారత్ ప్రభుత్వానికి సమాచారం అందింది. నిర్దేశిత దాడులకు ప్రతీకారంగా ఆర్మీపై దాడులు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కశ్మీర్ లోకి వచ్చినట్లు తెలిసింది.

లష్కర్‌-ఈ-తోయిబా, జైష్‌-ఈ-మొహమ్మద్, హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్స్ కు ముందే కశ్మీర్ లోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటినుంచి కశ్మీర్ లోనే వీరందరూ తలదాచుకుంటున్నారని పేర్కొంది. వీరందరికీ భారత ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాలనే సూచనలు అందాయని ఇంటిలిజెన్స్ తెలిపింది. దీంతో జమ్మూకశ్మీర్ లోని భద్రతా దళాలు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు ఆర్మీపై దాడికి దిగితే తిప్పికొట్టాలని చెప్పింది.

అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా అక్కడక్కడా భద్రతను ఏర్పాటుచేయడం కష్టతరంగా మారింది. దీంతో ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను కూడా చేపట్టారు. దాదాపు 100మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు ఎల్వోసీ ఆవల వేచి చూస్తున్నట్లు సమాచారం. గత నెల రోజుల్లో చొరబాటుకు ప్రయత్నించిన 40మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. బారాముల్ల, పాంపోర్, హంద్వారా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చొరబాటుకు టెర్రరిస్టులు యత్నించారు.

మరిన్ని వార్తలు