2600 కిలోల డ్రగ్స్, 12.43 లక్షల లీటర్ల మద్యం

11 Mar, 2017 09:30 IST|Sakshi
2600 కిలోల డ్రగ్స్, 12.43 లక్షల లీటర్ల మద్యం

సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, చీరలు, కుంకుమ భరిణెలు ఇలాంటివి పంచిపెట్టడం సర్వసాధారణం. అయితే, పంజాబ్‌లో మాత్రం వీటన్నింటికి తోడు డ్రగ్స్‌ను కూడా విపరీతంగా పంచేశారు. పాక్ సరిహద్దుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా యువత వీటికి బానిసలు అవుతున్నారంటూ ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. ఇదే అంశం ఆధారంగా 'ఉడ్తా పంజాబ్' సినిమా కూడా వచ్చింది. తాజా ఎన్నికల్లో కూడా డ్రగ్స్ పంపకాలు పెద్ద ఎత్తునే జరిగాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే తాము 2600 కిలోల డ్రగ్రస్, 12.43 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 14న ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని తాము స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా చెప్పారు. వాటితో పాటురూ. 58.02 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. పట్టుబడినవే ఈ మొత్తంలో ఉంటే, ఇక అప్పటికే పంచేసినవి ఇంకెంత ఉంటాయోనని విమర్శకులు అంటున్నారు.  వీటితో పాటు 164 కిలోల బంగారం, 26.145 కిలోల వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.

గోవాలో కూడా..
గోవా కూడా తక్కువ ఏమీ తినలేదు. ఇక్కడ ఆరు కిలోల డ్రగ్రస్, 75వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు. వాటితో పాటు 58.19 కిలోల బంగారు, వెండి ఆభరణాలు, 175 రాడో రిస్ట్ వాచీలు కూడా స్వాధీనం అయ్యాయి.

మరిన్ని వార్తలు