ఈ చిన్నారి చనిపోతూ ఏం చేసిందంటే..

2 Aug, 2015 18:56 IST|Sakshi
ఈ చిన్నారి చనిపోతూ ఏం చేసిందంటే..

 'మానవ చరిత్ర వర్థిల్లిందల్లా సాటి మనిషిని ఆదుకోవడంలోనే.. అది మరణంలోనైనా సరే' అనే సేయింగ్ను చదువుకోనప్పటికీ దానిని అక్షరాల పాటించి చిరస్మరణీయురాలిగా మిగిలిపోయింది మూడేళ్ల చిన్నారి అంజన.

శనివారం (నిన్న) సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయిన అంజన.. తన కిడ్నీలు, కాలేయం, కళ్లను ప్రాణాపాయంలో ఉన్న బాలుడికి దానం చేసింది. కేరళలో అవయవదానం చేసిన అతిపిన్న వయస్కురాలిగా కీర్తిగడించింది.

తిరువనంతపురంలోని  కరకులంలో నివసించే అజిత్ దంపతుల ఒక్కగానొక్క కూతురు అంజన. గత గురువారం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలిపోయిన అంజనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అంజన కండిషన్ ను 'సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్' గా గుర్తించిన వైద్యులు.. కొద్ది రోజుల్లో చనిపోవడం ఖాయమని తేల్చారు. ఆ తరువాత తల్లిదండ్రులను ఒప్పించి అవయవదానానికి రంగం సిద్ధం చేశారు. ఇక్కడ మనం ఒక విశేషాన్ని చెప్పుకోవాలి..

వైద్యశాస్త్రం బాగా అభివృద్థి చెందుతున్న ప్రస్తుత దశలో అవయవాల మార్పిడి ఆపరేషన్లు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ప్రైవేటు ఆసుపత్రుల దందాను సాధ్యమైనంతమేరకు నివారించడానికి 'కేరళ నెట్ వర్క ఆఫ్ ఆర్గాన్ షేరింగ్ (కేఎన్ఓఎస్) పేరుతో కేరళ ప్రభుత్వమే ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా దాతలు, గ్రహీతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనిటర్ చేస్తుంటారు.

అలా శనివారం రాత్రి అంజన అవయవాలను సేకరించిన కేఎన్ఓఎస్.. అదే రోజు రాత్రి ఓ ఐదేళ్ల బాలుడికి వాటిని అమర్చింది. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఆదివారం మద్యాహ్నం తిరువనంతపురంలో అంజన అంత్యక్రియలు 'ఘనంగా' జరిగాయి. అవును మరి, చిరంజీవులను ఆమాత్రం గౌరవించుకోకుంటే ఎలా!

మరిన్ని వార్తలు