బాలుడిని మింగిన బోరుబావి

30 Nov, 2015 02:37 IST|Sakshi
బాలుడిని మింగిన బోరుబావి

రక్తస్రావం, ఊపిరాడక చిన్నారి రాకేశ్ మృతి
* 22 గంటలపాటు సాగిన సహాయక చర్యలు వృథా
* ఆదివారం ఉదయం 6:45గంటలకు బాలుడి వెలికితీత
* హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలింపు
* అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారణ
* జారి పడిన 3-4 గంటల్లోనే బాలుడు మరణించి ఉండొచ్చన్న వైద్యులు

సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: జరగరానిదే జరిగింది... మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా ‘బోరుబావి ఘటన’ విషాదాంతమైంది.

మూడేళ్ల బాలుడు రాకేశ్‌ను బోరుబావి మింగేసింది. అతన్ని సజీవంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం దాదాపు 22 గంటలపాటు పడిన శ్రమ వృథా అయింది. ఆదివారం ఉదయం సరిగ్గా 6.45 గంటలకు బాలుడిని సహాయ బృందాలు బయటకు తీయగా అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్సులో అతన్ని హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాకేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ విజయ్‌కుమార్ బాలుడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మ, సోదరుడు బాలేష్, సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు శ్వాస అందక ఆ చిన్నారి మరణించి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. బాలుడు తలకిందులుగా బోరుబావిలో పడినందున అతను పడిన మూడు నాలుగు గంటల్లోనే మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

బాలుడిని కాపాడేందుకు సహాయ బృందాలు అంతకుముందు తీవ్రంగా శ్రమించాయి. మూడు భారీ ప్లొక్లెయిన్లను ఉపయోగించినా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు అధికారులు బోరుబావికి సమాంతరంగా కేవలం 18 అడుగుల గుంత మాత్రమే తీయగలిగారు. అడ్డువచ్చిన భారీ బండరాళ్లు సహాయక చర్యలను ముందకు కదలనివ్వలేదు. అయితే నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు 4 గంటలకు ఘటనా స్థలికి చేరుకొని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ నుంచి వివరాలు సేకరించి రంగంలోకి దిగాయి.

అయితే సమాంతర గుంతకు మరో పెద్ద బండరాయి అడ్డు రావడంతో దాన్ని డైనమెట్లతో పేల్చేయాలని నిర్ణయించాయి. బోరుబావికి నష్టం కలగకుండా పేల్చేందుకు ఉదయం 4.30కి డ్రిల్లింగ్ మెషిన్‌తో బండకు వరుస రంధ్రాలు చేశాయి. బోరు బావిలోకి సీసీ కెమెరాలను వదిలి బాలుడి పరిస్థితిని, చుట్టూ పరిసరాలను గమనించాయి.
 
సాధారణ మెకానిక్ సాయం
బోరుబావి ఘటనను టీవీలో చూసి తెలుసుకున్న నల్లగొండ జిల్లా వేములపల్లికి చెందిన సాధారణ బోరుబావి మెకానిక్ పుట్టా కరుణాకర్ తన వంతు సాయం అందించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాడు. సమాంతర బావి తవ్వే అవసరం లేకుండా తన వద్ద ఉన్న పరికరాలతో బాలుడిని సురక్షితంగా బయటకు తీస్తానని... అందుకు అవకాశం ఇవ్వాలని సహాయ బృందాలు, ఆర్డీఓ నగేశ్‌ను అభ్యర్థించాడు.

సీసీ కెమెరాలను బోరుబావిలోకి పంపి వాటి ఆధారంగా బాలుడికి గాయం కాకుండా క్లిప్పులు తగిలించి 3, 4 నిమిషాల్లో కప్పి సాయంతో బయటికి లాగుతానంటూ అప్పటికప్పుడు డెమో నిర్వహిం చాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ...డిజాస్టర్ మేనేజ్‌మెంటు సభ్యుల అభిప్రాయం తీసుకొని కరుణాకర్‌ను కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు అనుమతించారు.

వెంట తెచ్చుకున్న పరికరాల సాయంతో 40 నిమిషాలు ప్రయత్నించి రాకేశ్ కాళ్లకు క్లిప్పులు తగిలించిన కరుణాకర్...తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కప్పి ద్వారా సరిగ్గా ఉదయం 6.45కు రాకేష్‌ను బయటికి తీశారు. కాగా, చిన్నారి రాకేశ్ మరణం దురదృష్టకరమని, ఈ ఘటన తనను కలచివేసిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. విఫలమైన బోరుబావులను ప్రజలు ఇప్పటికైనా గుర్తించి వెంటనే పూడ్చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు