మళ్లీ ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం

1 Jul, 2016 15:29 IST|Sakshi
మళ్లీ ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం
  • కుంభవృష్టి, వరదలతో చమోలి జిల్లా అస్తవ్యస్తం
  • 30 మంది మృతి..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
  • ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన ఉత్తరాఖండ్ మళ్లీ ప్రకృతి విలయంతో అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ బీభత్సం ధాటికి చమోలి జిల్లాలో కనీసం 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అంతకంతకు చేజారుతుండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెంటనే స్పందించి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రాష్ట్రానికి పంపింది.

    ఉరుముతున్న అలకనంద నది
    గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అలకనంద నది ప్రమాదస్థాయిని ధాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.

    మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం
    రాష్ట్రంలోని వరద బీభత్సంపై సమీక్ష నిర్వహించిన సీఎం హరీశ్ రావత్ ఈ విలయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. పిత్తరగఢ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలను పంపినట్టు ఆయన తెలిపారు. మరోవైపు థాల్-మున్సియారి రోడ్డు వరదల ధాటికి తెగిపోవడంతో ఇరుపక్కల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వానలు, వరదల తాకిడికి పెద్ద ఎత్తున పంటపొలాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఎంతకూ నిలువకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో చాలా జిల్లాల్లో ప్రజాజీవితం స్తంభించిపోయింది.

మరిన్ని వార్తలు