ఒకే కుటుంబంలో 31 మంది డాక్టర్లు

23 Jun, 2014 21:21 IST|Sakshi

జైపూర్: ఒక కుటుంబంలో ఇద్దరో, ముగ్గురో డాక్టర్లుంటేనే ‘వాళ్లది డాక్టర్ల కుటుంబం’ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబంలో ఏకంగా 31 మంది డాక్టర్లుంటే? డాక్టర్ల వంశం అనాలా, డాక్టర్ల ప్రపంచం అనాలా.. మీరే తేల్చుకోండి! అలాంటి అరుదైన కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. తాజాగా అందులోని వినమతా పత్ని అనే విద్యార్థిని(17)కి కూడా ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. రాజస్థాన్ ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఆమెకు 107వ ర్యాంకు లభించింది. ఆమె కోర్సు పూర్తి చేస్తే కుటుంబంలో వైద్యుల సంఖ్య 32కు చేరుతుంది. వినమత చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుంది. అండర్-19 యువతుల విభాగంలో ఆమె రాష్ట్రంలో ఉత్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. అయితే బాస్కెట్ బాల్ ను మాత్రం కెరీర్ గా ఎంచుకోదల్చుకోలేదని ఆమె తెలిపింది. అది తనకు ఒక హాబీ మాత్రమేనని స్పష్టం చేసింది.తన తొలి ప్రాధాన్యత మాత్రం కుటుంబం ఎంచుకున్న వైద్య వృత్తికేనని పేర్కొంది.

 

ప్రస్తుతం ఆమె తండ్రి తరుణ్ పత్నిపీడియాట్రిషిన్ (శిశు వైద్యుడు)గా సేవలందిస్తుండగా, తల్లి మాత్రం గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. కాగా, ఆమె తాత మాత్రం న్యాయవాది వృత్తిలో కొనసాగారు. ఆయన ఎనిమిది మంది సంతానంలో ఏడుగురు వైద్య వృత్తిలో ఉన్నారు. ఇక అక్కడ నుంచి వారి ప్రస్థానం వైద్య వృత్తినే ముడిపడుతూ వస్తోంది. ఇలా అందరూ ఒకే వృత్తిలో ఉండటానికి ప్రజలకు సేవ చేయాలన్న తాత ఆశయమే కారణమని వినమత పేర్కొంది.

మరిన్ని వార్తలు