31 మంది విద్యార్థులకు జైకా స్కాలర్‌షిప్‌లు

16 Mar, 2017 17:36 IST|Sakshi

గడిచిన మూడేళ్లలో మొత్తం 31 మంది విద్యార్థులకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) స్కాలర్‌షిప్‌లు అందాయని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలిపింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఐఐటీల విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకోడానికి వీలుగా జైకా రుణాలు ఏమైనా ఇస్తున్నారా, అలాగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి గత మూడేళ్లలో ఎంతమంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందాయని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. జైకా, ఇతర సంస్థల నిధులతో ఏడు ఐఐటీలలో అంతర్జాతీయ స్థాయి ల్యాబ్‌లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా.. అలా అయితే ఎక్కడెక్కడ అని కూడా అడిగారు. అయితే, ల్యాబ్‌ల ఏర్పాటు ప్రతిపాదన ఏమీ లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు జపాన్‌లోని వివిధ యూనివర్సిటీలలో చదువుకోడానికి వీలుగా జైకా స్కాలర్‌షిప్‌లు ఇస్తుందని, అందుకోసం అక్కడి యూనివర్సిటీల ప్రతినిధులు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ, స్క్రీనింగ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారని ఆ సమాధానంలో తెలిపారు. గత మూడేళ్లలో ఈ స్కాలర్‌షిప్‌లకు 31 మంది ఎంపికయ్యారని, 2013లో 9 మంది, 2014లో 12 మంది, 2015లో 10 మంది ఎంపికయ్యారని వివరించారు. ఈ ఏడాది ఆ స్కాలర్‌షిప్‌కు 13 మంది ఎంపికయ్యారని, వారిలో నలుగురు ఏపీ/ తెలంగాణల నుంచి ఉన్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు