టీవీలపైనా సుంకాల మోత

20 Aug, 2013 03:13 IST|Sakshi

న్యూఢిల్లీ: సుంకాల భారం లేకుండా చౌకగా వస్తుందనే ఉద్దేశంతో విదేశాల నుంచి టీవీ తెచ్చుకుందామనుకుంటే ఇకపై పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఇలాంటి టీవీల దిగుమతులపైనా సుంకాల మోత మోగనుంది. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరిగిపోతున్న నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా కాపాడటానికి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న ప్రభుత్వం తాజాగా వీటిపైనా దృష్టి సారించింది. ఈ తరహా సుంకాలు లేని ఫ్లాట్ స్క్రీన్ టీవీల దిగుమతులను నిషేధించింది. దీంతో ఇకపై ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ప్లాస్మా వంటి ఫ్లాట్ పానెల్ టీవీలపై 36.05% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
 
 ఉచిత బ్యాగేజి కింద దాదాపు దశాబ్ద కాలం పైగా టీవీలకు ఇస్తున్న సుంకాల మినహాయింపు నిబంధనను సవరిస్తూ రెవెన్యూ విభాగం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టు 26 నుంచి ఇలాంటి టీవీలపై 35% కస్టమ్స్ డ్యూటీ, దానిపై మరో 3% విద్యా సెస్సు....వెరసి 36.05% దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికులు వ్యక్తిగత వాడకం కోసం విదేశాల నుంచి తెచ్చుకునే ఫ్లాట్ స్క్రీన్ టీవీలపై ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
 
 క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం (క్యాడ్) భారీగా పెరిగిపోతోండటం, రూపాయి క్షీణిస్తుండటంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే  పసిడి, ప్లాటినం, వెండిపై ప్రభుత్వం సుంకాలను 10% మేర పెంచింది. అయినా ఫలితం కనిపించక  తాజాగా ఈ తరహా చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు