తండ్రి తీర్పును సరిదిద్దిన కుమారుడు

25 Aug, 2017 03:56 IST|Sakshi
తండ్రి తీర్పును సరిదిద్దిన కుమారుడు

న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కుమారుడు గతంలో తన తండ్రి ఇచ్చిన తీర్పునే తప్పుబట్టినట్లయింది. 1975లో అత్యవసర స్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులను పక్కనబెట్టారు. 1976లో సుప్రీంకోర్టు ‘ఏడీఎం జబల్‌పూర్‌’ కేసులో తీర్పునిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ప్రాథమిక హక్కులు కావంది. నాటి ధర్మాసనంలో జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ అనే న్యాయమూర్తి ఉన్నారు.

తాజాగా తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఆయన కుమారుడు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యుడిగా ఉన్నారు. 1976లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తీవ్రమైన దోషాలు ఉన్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌  పేర్కొన్నారు. ‘ఆ తీర్పు దోషాలతో కూడింది. మానవ హక్కుల నుంచి జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛలను విడదీయలేము. ఏ నాగరిక రాజ్యమూ జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించేలా ఆలోచించదు’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన తీర్పులో పేర్కొన్నారు. దీనిపై ఓ సీనియర్‌ న్యాయవాది వ్యాఖ్యానిస్తూ...దోషాలతో కూడిన తీర్పును తండ్రి ఇవ్వగా కొడుకు దానిని సరిదిద్దినట్లైందన్నారు.

>
మరిన్ని వార్తలు