వైష్ణోదేవి గుడిలో 43 కిలోల నకిలీ బంగారం

29 Jan, 2014 16:55 IST|Sakshi

దేవుడంటే భయం, భక్తి రెండూ ఉంటాయి. వాటివల్లే కాస్త జాగ్రత్తగా ఉంటారని అనుకుంటాం. కానీ, జమ్ము కాశ్మీర్లోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలలో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి.. అంతా నకిలీదేనట!! ఈ విషయం సమాచార హక్కు చట్టం దరఖాస్తులో వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 193.5 కిలోల బంగారం, 81,635 కిలోల వెండిని కట్రా పట్టణంలోని వైష్ణోదేవి ఆలయంలో సమర్పించారు. ఇందులో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి నకిలీవిగా తేలాయని ఆలయ పాలకమండలి సీఈవో ఎంకే భండారీ వెల్లడించారు.

సాధారణంగా అయితే తాము ఇలా వచ్చిన బంగారం, వెండి మొత్తాన్ని ప్రభుత్వానికి పంపి, వాటిని కరిగించి బంగారు, వెండి నాణేలుగా మార్చి భక్తులకు ఇస్తామని ఆయన తెలిపారు. అయితే, భక్తులు కావాలని ఇలా నకిలీ బంగారం వేసి ఉండకపోవచ్చని, వారు కొనేటప్పుడు నాణ్యత పరీక్షలు చేయించుకోకపోవడమే ఇందుకు కారణం అయి ఉండొచ్చని భండారీ చెప్పారు. వైష్ణోదేవి ఆలయానికి గత సంవత్సరం కోటి మందికి పైగా భక్తులు వచ్చారు.

మరిన్ని వార్తలు