రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ

25 Aug, 2015 04:22 IST|Sakshi
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ

అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఘోరం
* ఐదుగురు దుర్మరణం...
* మృతుల్లో కర్ణాటక ఎమ్మెల్యే వెంకటేశ్

సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలును 25 టన్నుల గ్రానైట్ రాయిని తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఐదుగురి మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందినవారిలో కర్ణాటకకు చెందిన దేవదుర్గం ఎమ్మెల్యే వెంకటేశ్‌నాయక్(60) ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ  సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2.27 గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెనుకొండ-మడకశిర రోడ్డులోని రైల్వేక్రాసింగ్ వద్ద, మడకశిర నుంచి పెనుకొండవైపు గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి రైలును ఢీకొనడంతో ఈ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలిం చారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

ప్రమాదానికి లారీ బ్రేక్‌ఫెయిల్ కావడంతోపాటు రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండటం కూడా కారణమని తెలుస్తోంది. ప్రమాదంతో బెంగళూరు వైపు వెళ్లే రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్ల రాకపోకలు దారి మళ్లిం చారు. కాగా, పెనుకొండ ప్రమాదం దురదృష్టకర సంఘటనని, మృతుల కుటుం బాలను ఆదుకుంటామని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా పేర్కొన్నారు. ప్రమాదంపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ  చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
 
రెలు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సోమవారం తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో ఇది మూడో సంఘటననీ, అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్దుష్టమైన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
 
మృతుల వివరాలు
 1.    టీఎస్‌డీ రాజు (53), జీఎం. ఇండోఫిల్ ఇండస్ట్రీ, బెంగళూరు
 2.    పుల్లారావు (48) రైతు, రాయచూరు
 3.    సయ్యద్ అహ్మద్ (రైల్వే ఎలక్ట్రిషియన్, బెంగళూరు)
 4.    వెంకటేశ్‌నాయక్ (60) ఎమ్మెల్యే, దేవదుర్గం, కర్ణాటక)
 5.    నాగరాజు,(48) బి. కొత్తపల్లి, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా
 
క్షతగాత్రులు:
1.    జగదీశ్ గుప్తా (53) రాయచూరు
2. శ్రీమతి శాంత (46) రాయచూరు (జగదీశ్ గుప్తా భార్య)
 3.    సురేశ్ (దావణగేరి)

మరిన్ని వార్తలు