ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఇదిగో ఫుల్‌ ఇన్ఫర్మేషన్‌!

11 Mar, 2017 21:04 IST|Sakshi
ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఇదిగో ఫుల్‌ ఇన్ఫర్మేషన్‌!

గత కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటికీ సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి వెల్లడైన సరళి సాయంత్రం వరకు అలాగే కొనసాగాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గెలుపెవరిదో ఉదయమే స్పష్టమైంది. అయితే గోవా, మణిపూర్ రాష్ట్రాల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య నువ్వానేనా అన్న సస్పెన్స్ కొనసాగింది.

యూపీలో మోదీ ప్రభంజనం
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ రికార్డు సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పగా.. ఆ అంచనాలను తలదన్నేరీతిలో భారీ విజయం సొంతం చేసుకుంది. ఏకంగా మూడింట రెండు వంతుల భారీ మెజారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మొత్తం 403 స్థానాలున్న యూపీలో బీజేపీ సొంతంగా ట్రిపుల్‌ సెంచరీ సాధించడం గమనార్హం. ఆ పార్టీకి సొంతంగా రికార్డు స్థాయిలో 311 స్థానాలను రాగా.. మిత్రపక్షాలతో కలుపుకొని 325 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టి.. రాహుల్‌గాంధీతో కలిసి ప్రచారం చేసి.. గెలుపుపై అనేక ఆశలు పెట్టుకున్న యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఘోరంగా దెబ్బతిన్నారు. ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి కేవలం 54 స్థానాలే గెలుపొందింది. ఇందులో కాంగ్రెస్‌ గెలిచినవి ఏడు స్థానాలు.  ఆ పార్టీ రెండు అంకెల స్థానాలను కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. హంగ్‌ అసెంబ్లీ వస్తే కింగ్‌ మేకర్‌ అవుతానని ఎంతో నమ్మకం పెట్టుకున్న మాయావతి కలలో కూడా మోదీ హవాలో కొట్టుకుపోయాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కేవలం 19 స్థానాలు గెలుచుకొని మూడో స్థానానికి పరిమిమైంది.


పార్టీల వారీగా సీట్లు.. ఓట్లశాతం


 

పంజాబ్‌లో హస్తానికి ఊరట
యూపీ, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్‌లో ఊరట కలిగించే విజయం లభించింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఛరిష్మా, అధికార అకాలీ-బీజేపీ కూటమిపై ప్రజావ్యతిరేకత, క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేరిక కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చాయి. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 77 స్థానాలు సాధించి.. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. పంజాబ్‌లో సత్తా చాటి ఢిల్లీ అవతలకు విస్తరించి జాతీయ పార్టీగా ఎదగాలన్న ఆప్‌ కలలు కల్లలయ్యాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ పంజాబ్‌లో అధికారంలోకి రావడం సంగటి అంటుంచి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ కేవలం 20 స్థానాలు గెలుపొందింది. ఇక అధికార ఎస్‌ఏడీ-బీజేపీ కూటమి 18 స్థానాలతో మూడో స్థానానికి పరిమితం అయింది.

పార్టీల వారీగా సీట్లు.. ఓట్లశాతం





ఉత్తరాఖండ్‌లో కమలవికాసం
యూపీలోనే కాదు ఉత్తరాఖండ్‌లోనూ కమలం వికసించింది. మోదీ ప్రభంజనంతో ఉత్తరాఖండ్‌లో బలంగా వీచిందని ఫలితాలను బట్టి స్పష్టమవుతున్నది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 56 స్థానాల్లో గెలుపొందింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఇక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు.

పార్టీల వారీగా సీట్లు.. ఓట్లశాతం



 

మణిపూర్‌: కాంగ్రెస్‌కు ఆధిక్యం
మణిపూర్‌లో అధికారం కోసం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది. చివరివరకు ఉత్కంఠ రేపిన ఇక్కడి ఫలితాలలో బీజేపీని వెనక్కి తోసి కాంగ్రెస్‌ పార్టీ కాస్తా ముందంజలో ఉంది. మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 27 కైవసం చేసుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.  అలాగే బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎన్‌పీఎఫ్‌ వంటి ఇతర పార్టీలు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

పార్టీల వారీగా సీట్లు.. ఓట్లశాతం



 

గో..గో.. గోవా.. ఎటువైపు!
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. 40 స్థానాలు ఉన్న ఇక్కడ కాంగ్రెస్ 17 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందింది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 3 స్థానాలు, గోవా ఫార్వర్డ్ పార్టీ 3 స్థానాల్లో, ఎన్సీపీ 1, స్వతంత్రులు 3 స్థానాలు గెలుపొందారు. ముఖ్యంగా బీజేపీ నేత, గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో ఓటమిపాలయ్యారు.

పార్టీల వారీగా సీట్లు.. ఓట్లశాతం




 

మరిన్ని వార్తలు