మంత్రగత్తెలని ఐదుగురి హత్య

9 Aug, 2015 00:56 IST|Sakshi
మంత్రగత్తెలని ఐదుగురి హత్య

జార్ఖండ్‌లో దారుణం   27 మంది అరెస్ట్
 
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో మంత్రగత్తెలనే నెపంతో ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేశారు. గిరిజన ప్రాబల్యమున్న కంజియా గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గ్రామస్తులు కొందరు.. 32-50 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు మహిళలను వారి ఇళ్ల నుంచి లాకొచ్చి,  క్షుద్రవిద్యలకు పాల్పడుతున్నారంటూ లాఠీలు, పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపారు. తర్వాత మృతదేహాలను సంచుల్లో ఉంచి ఊరి బయట పడేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి శనివారం ఉదయం వెళ్లగా గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు చనిపోవడంతో హత్యకు గురైన మహిళలు చేతబడులకు పాల్పడుతున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ కేసుకు సంబంధించి 50 మందిని నిందితులుగా గుర్తించామని, 27 మందిని అరెస్ట్ చేశామని డిప్యూ టీ ఐజీ అరుణ్ కుమార్ తెలిపారు. జార్ఖండ్‌లో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్నాయి.

2013 దేశవ్యాప్తంగా మంత్రగత్తెలనే నెపంతో 160 మంది మహిళలు హత్యకు గురికాగా, వారిలో 54 హత్యలు జార్ఖండ్‌లోనే జరిగాయి. 2001 నుంచి రాష్ట్రంలో 400 మంది మహిళలను ఇదే కారణంతో హత్య చేశారు. దేశంలో 2001-12 మధ్య ఇలాంటి హత్యలు 2,097 జరిగినట్లు జాతీయ నేర రికార్డుల సంస్థ అంచనా వేసింది. కాగా తాజా హత్యలను జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఖండించారు. ప్రస్తుత విజ్ఞాన యుగంలో ఇలాంటి ఘటనలు జరగడం విషాదకరమని, దీనిపై సమాజం ఆలోచించాలని ఓ ప్రకటనలో కోరారు. తాజా హత్యలను జార్ఖండ్ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా ఖండించింది. వీటిని అరికట్టేందుకు, మహిళలకు భద్రత కల్పించి, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పటిష్టమైన విధానం అవసరమని కమిషన్ చైర్‌పర్సన్ మహువా మాంఝీ చెప్పారు. వితంతువుల భూములను లాక్కోవడానికి కొందరు స్వార్థపరులు వదంతులు ప్రచారం చేస్తున్నారని, తమకు గిట్టని మహిళ ఎన్నికల్లో పోటీ చే స్తే ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, పట్టణాలతో రోడ్ల అనుసంధానం లేకపోవడం మూఢనమ్మకాలకు కారణమని ఆమె పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు