రాష్ట్రంలో 50 వేల కోట్ల వ్యాపార లక్ష్యం

3 Aug, 2013 01:54 IST|Sakshi
M.Narendra

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార విస్తరణకు అవకాశాలు అధికంగా ఉండటంతో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) పేర్కొంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో రూ.50,000 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐవోబీ సీఎండీ ఎం.నరేంద్ర శుక్రవారం పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ర్టంలో రీజనల్ ఆఫీస్‌ల సంఖ్యను ఏడుకు పెంచామని, అలాగే కొత్తగా 31 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవోబీ రాష్ట్రంలో రూ.30,344 కోట్ల వ్యాపారం చేస్తోంది. రూ.40 కోట్ల రుణం మంజూరు చేసే అధికారాన్ని కల్పిస్తూ కొత్తగా నేషనల్ హెడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాపారం పెంచుకోవడానికి 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ సమయంలో తీసుకున్న గృహ, విద్య, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజుల్లో రాయితీలిస్తున్నట్లు తెలిపారు.
 
  ఈ 100 రోజుల్లో కొత్తగా 25 లక్షల ఖాతాలను ప్రారంభించాలని, ఏడాది మొత్తంమీద 75 లక్షల ఖాతాలు తెరిపించాలనేది లక్ష్యమన్నారు. ఈ ఏడాదిని ‘ఇయర్ ఆఫ్ ది యూత్’గా ప్రకటించామని.. యువతను ఆకర్షించడానికి సోషల్ నెట్‌వర్క్ ద్వారా పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. రూపాయి విలువ తగ్గడంతో ఎన్నారైలు ఇండియాకి రెమిటెన్స్‌లు 25% పెరిగాయని చెప్పారు.

మరిన్ని వార్తలు