6 బిల్లులకు ఆమోదం

7 Sep, 2013 04:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో శుక్రవారం ప్రజాప్రాతినిధ్య సవరణ బిల్లు, వైమానిక వర్సిటీ బిల్లు సహా మొత్తం 6 బిల్లులకు ఆమోదం లభించింది. జైళ్లలో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు: జైళ్లలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసే ఉద్దేశంతో పెట్టిన ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. జైళ్లలో ఉన్నవారికి ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాపాడేందుకు పెట్టిన ఈ బిల్లుccccలో స్వల్ప చర్చతోనే ఆమోదం పొందగా, రాజ్యసభలో చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
 
 లాభదాయక పదవులకు వెలుపల ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ పదవులు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ పదవులను లాభదాయక పదవుల పరిధి నుంచి తప్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీనిని ఇదివరకే రాజ్యసభ ఆమోదించింది. లాభదాయక పదవుల జాబితా నుంచి వీటిని తప్పిస్తూ ప్రభుత్వం పార్లమెంటు అనర్హత నిరోధక సవరణ బిల్లును రూపొందించింది. ఇక ఎలాంటి అనర్హత భయం లేకుండా ఎంపీలు ఎవరైనా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ పదవుల్లో కొనసాగేందుకు వెసులుబాటు ఏర్పడింది.
 
 వైమానిక యూనివర్సిటీ బిల్లు: విమానయాన రంగం అభివృద్ధికి నిపుణులైన సిబ్బందిని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న రాజీవ్‌గాంధీ జాతీయ వైమానిక యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో (సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం) రూ. 200 కోట్లతో కేంద్రం ఈ వర్సిటీని నెలకొల్పనుంది.
 
 పారిశుధ్య పనిని నిషేధంపై: పారిశుధ్య పనిని నిషేధిస్తూ పెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ పని కోసం మనుషులను నియమించడాన్ని నిషేధించడంతో పాటు ఆ పనిలో కొనసాగుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర మార్గాల ద్వారా పునరావాసం కల్పించేందుకు ఈ బిల్లును పెట్టారు. అలాగే, పట్టణాల్లోని వీధి వర్తకుల హక్కుల రక్షణ బిల్లును, పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాథికార సంస్థ బిల్లును రాజ్యసభ ఆమోదించాయి.లోక్‌సభ నిరవధికంగా వాయిదా: వర్షాకాల సమావేశాలు దాదాపు నెల్లాళ్లు కొనసాగిన తర్వాత శుక్రవారం రాత్రి లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది.

మరిన్ని వార్తలు