60లక్షలమంది రూ.7లక్షల కోట్లు

30 Dec, 2016 08:38 IST|Sakshi
60లక్షలమంది రూ. 7లక్షల కోట్లు

న్యూఢిల్లీ: రద్దు చేసిన పెద్ద నోట్ల రూపంలో నల్లధనం దాచుకున్న వారికి చివరి అవకాశంగా ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకంపై (పీఎంజీకేవై)   ద్వారా  60 లక్షలమంది వ్యక్తులు మరియు సంస్థలు చేసిన  డిపాజిట్లు లేదా పన్ను  చెల్లింపులు చేసినట్టు  ప్రభుత్వం గురువారం  ప్రకటించింది. తద్వారా రూ. 7 లక్షల కోట్లు  బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్టు  సీనియర్  అధికారి ఒకరు తెలిపారు. సక్రమమైన  పన్నుచెల్లింపుదారులకు  ఎలాంటి ప్రమాదం ఉండదనీ, అదే సందర్భంలో  అక్రమ పద్ధతిలో  నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటే   సహించేది లేదని    హెచ్చరించారు.  
డీమానిటైజేషన్ తర్వాత ప్రకటించిన  అప్రకటిత సంపద, పన్ను ఎగవేతదారులకు  క్షమాభిక్ష పథకం  ద్వారా వ్యక్తిగత డిపాజిట్లు 3-4 కోట్లుగా ఉంటుందని అంచనావేశామనీ,కానీ ఇంతపెద్ద మొత్తంలో  డిపాజిట్లు రావడం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన  'ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన'  పథకం ద్వారా తమకు తాముగా వచ్చి పన్నులు చెల్లిస్తే  సరే..లేదంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు.  
వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకుపాల్పడ్డ వారిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టిందని తెలిపారు.  దీనికి సంబంధించిన వ్యవస్థతో  తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.  ఆదాయాన్ని వెల్లడించని వారికి ఇచ్చిన  మరో అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పన్ను ఎగవేత దారులు  'ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన'  ద్వారా వారి బకాయిలను చెల్లించాలన్నారు. అలాగే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినంత మాత్రాన నల్లధనం  తెల్లధనంగా పరిగణించబడదని, రూ.2  లక్షలు, రూ.5 లక్షలకు  పైన  నమోదైన డిపాజిట్లను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందని తెలిపారు.

అలాగే ఆయా ఖాతాల్లో  రూ.2 లక్షలకు పైగా డిపాజిట్ అయిన వ్యక్తులను కూడా వదిలి పెట్టేది లేదనీ, సుమారు 60 లక్షల డిపాజిట్ దారుల వివరాలు తమ దగ్గర వున్నాయని దీంతో చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని చెప్పారు.    ఫలితంగా ఈ ఏడాది,  తదుపరి ఏడాది రాబడిని భారీగా అంచనావేస్తున్నామన్నారు.
కాగా డిసెంబర్ 17 అమల్లోకి వచ్చిన పీఎంజీకేవై  పథకంలోమార్చి 31, 2017తో ముగియనుంది.  ఈ పథకం కింద నల్లధనాన్ని వెల్లడించాలనుకునేవారు నిబంధనల ప్రకారం యాభై శాతం పన్ను చెల్లించడంతోపాటు పాతిక శాతం సొమ్మును డిపాజిట్ చేసినట్లుగా ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ పథకం కింద చెల్లించిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫండ్ చేయడం జరుగదని  స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు