‘మీ పిల్లలు చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు’

17 Sep, 2016 12:04 IST|Sakshi
‘మీ పిల్లలు చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు’

పాల్ ఘర్: తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన గిరిజనులపై ఓ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  పోషకాహార లోపంతో పిల్లలు చనిపోతున్నారని.. ఆదుకోవాలని మొర పెట్టుకున్నవారిపై  మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావ్రా విరుచుకుపడ్డారు.  పౌష్టికాహార లోపంతో బాలలు అధికంగా మరణిస్తున్న యెఖదా సబ్ జిల్లాలోని ఖోచ్ గ్రామంలో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఏడాదికాలంలో దాదాపు 600 మంది పిల్లలు పోషకాహార లోపంతో మరణించారని  గ్రామంలో కొందరు మంత్రితో మొరపెట్టుకున్నారు.

మరికొందరు ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని సావ్రాను నిలదీశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సావ్రా మీ పిల్లలు చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కోపోద్రేకులైన  గ్రామస్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... గ్రామం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

కాగా, గిరిజన గ్రామ పర్యటనలో వివాదాస్పదంగా మాట్లాడిన మంత్రి సావ్రా వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మాటమార్చిన సావ్రా.. తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు సావ్రా గ్రామస్ధులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్రంలో పౌష్టికాహార లోప మరణాలు అదుపులోకి తీసుకురావాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజా ముండే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావ్రా, ప్రజా ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు