ఉద్యోగాలకు ‘ఉరి’ !

23 Oct, 2013 02:58 IST|Sakshi
ఉద్యోగాలకు ‘ఉరి’ !

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్ పడింది. 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినా ఫలితం లేకుండా పోయింది. నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసి రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సీఆర్ బిశ్వాల్ రెండురోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అయినా నోటిఫికేషన్ల జారీ అంశంపై స్పష్టత రాలేదు.
 
  ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ కోటా భర్తీ విషయంలో అపోహలు వస్తాయనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ల జారీని పక ్కనబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఎదురుచూపులు చూస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి సిద్ధమైనా పరీక్షల నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్, ఎస్సై వంటి పోస్టులు, ఏపీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2 తదితర పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు ఏం చేయాలో పాలుపోని అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ శిక్షణ పొందుతున్న అనేకమంది అభ్యర్థులు ఆర్థికభారం దృష్ట్యా ఇంటిదారి పడుతున్నారు.
 
 మూలనపడిన ఏపీపీఎస్సీ షెడ్యూల్
 గత నాలుగు నెలల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 63,518 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన దాదాపు 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి సిద్ధమైంది. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి తేదీల వివరాలతో షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంతలోనే ‘రాష్ట్ర విభజన’ అంశం తెరపైకి వచ్చింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో షెడ్యూలు కాస్తా కాగితాలకే పరిమితమైపోయింది. పోలీసు శాఖలో, డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీల ద్వారా కూడా పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన అన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీ వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వం ఓకే అంటే నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర విడిపోయే అవకాశాలున్న దృష్ట్యా ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ సరికాదని, విభజన తరువాత ఆయా రాష్ట్రాల్లో నియామకాలకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
 
 ఆమోదం పొందిన పోస్టుల వివరాలు..

 ప్రభుత్వ ప్రధాన కార్యదరిశ గత ఏప్రిల్ 28న వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లోనూ కలిపి 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేల్చారు. వాటిల్లో ఇప్పటివరకు 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3వ తేదీన 33,738 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. అందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు (గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్ తదితర అన్ని కేటగిరీలు), పోలీసు శాఖలో 11,623 పోస్టులు (కానిస్టేబుల్, ఎస్సై), డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల (డీఎస్సీలు) ద్వారా 10,865 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది.
 
 ఇక జూలై 2వ తేదీన 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, ఏపీపీఎస్సీ ద్వారా మరో 1,127 పోస్టుల భర్తీకి, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443 పోస్టుల భర్తీకి ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే 2,677 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. తాజాగా సెప్టెంబర్ 30వ తేదీన కూడా మరో 3,025 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఆ తరువాత మూడు రోజులకే తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ల జారీపై పూర్తిస్థాయిలో నీలినీడలు కమ్ముకున్నాయి.

మరిన్ని వార్తలు