గొడ్డలితో దాడిచేసిన వృద్ధురాలు!!

16 Dec, 2016 08:57 IST|Sakshi
గొడ్డలితో దాడిచేసిన వృద్ధురాలు!!
అవును.. మీరు సరిగ్గానే చదివారు. గొడ్డలితో వృద్ధురాలిపై దాడి జరగలేదు, ఆమే గొడ్డలి పట్టుకుని నానా హడావుడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని కుతుబ్‌మినార్ మెట్రోస్టేషన్‌లో జరిగింది. ఆమె వయసు సుమారు 65 సంవత్సరాలుంటుంది. ఆమె గొడ్డలి పట్టుకుని తోటి ప్రయాణికులపై దాడి చేసింది. మెట్రో రైల్లో కేవలం మహిళల కోసం ఒక బోగీ రిజర్వు అయి ఉంటుంది. ఆ బోగీలో సీటు కోసం జరిగిన గొడవలో.. ఆమె గొడ్డలితో హల్‌చల్ చేసింది. రైలు బోగీలోకి ఆమె ఎక్కేసరికి సీట్లన్నింటిలోనూ మహిళలు కూర్చుని ఉన్నారు. అంతలో సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వు చేసిన సీట్లో ఒక 32 ఏళ్ల మహిళ కూర్చుని ఉండటాన్ని ఆమె చూసింది. ఆ సీటు ఖాళీ చేసి తనకు ఇవ్వాలని వృద్ధురాలు కోరగా.. ఆమె నిరాకరించింది. దాంతో ఆ వృద్ధురాలు ఆమెను చెంపమీద కొట్టింది. 
 
ఆ సమయంలో మిగిలిన ప్రయాణికులు కలగజేసుకుని.. రైల్లో గొడవలు వద్దని చెప్పారు. దాంతో ఆమెకు మరింత కోపం వచ్చి, బ్యాగులోంచి గొడ్డలి తీసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఆయుధం చూసిన మహిళలు ఒక్కసారిగా భయపడి.. సాయం కోసం గట్టిగా అరిచారు. కొంతమంది మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి ఆమెను పట్టుకుని, ఆమె చేతుల్లోంచి గొడ్డలి లాగేసుకున్నారు. తర్వాతి స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాయంతో ఆమెను దించేశారు. 
 
సాధారణంగా మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్నంతటినీ దాటుకుని మరీ ఆమె తన బ్యాగులో ఈ గొడ్డలి పెట్టుకుని వచ్చింది. అయితే.. ఆమె దాడి చేయబోతుండగా తోటి మహిళలంతా కలిసి ఆమెను అడ్డుకుని, పట్టుకుని తదుపరి స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అయితే.. వాళ్లు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని అదుపులోకి తీసుకోకుండా, గొడ్డలి స్వాధీనం చేసుకుని, ఆమెను హెచ్చరించి పంపేశారు.
మరిన్ని వార్తలు