అమ్మ ఫొటో లేకపోవడం లోటే

23 Mar, 2017 02:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫొటోలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 6వ జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వెంకయ్య బుధవారం ప్రముఖ ఫోటో జర్నలిస్టు రఘు రాయ్‌తో సహా పలువురికి జీవితకాల సాఫల్య పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకున్న వెంకయ్య భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా అమ్మను నా వయసు ఏడాదిన్నర ఉన్నప్పుడు కోల్పోయాను.

ఆవిడ ఫోటో లేకపోవడం నాకెప్పుడూ లోటుగానే ఉంటుంది’ అని అన్నారు. 1984లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను కుట్రతో గద్దెదింపిన సమయంలో ఫోటోలు చేసిన సాయాన్ని వెంకయ్య గుర్తుచేశారు. ‘అప్పుడు మేము ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహిస్తే ఇక్కడుండే కొందరు వ్యక్తులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారని ప్రచారం చేశారు.

అందుకోసం నకిలీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ఎమ్మెల్యేలంతా ఢిల్లీలోనే ఉన్నారని నిరూపించడానికి ఎల్‌.కె.అడ్వాణీ సలహా మేరకు రఘు రాయ్‌ సాయం తో ఫొటోలు తీసి గవర్నర్‌కు పంపించాం’ అని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు