'ఈ రోజుకీ ఆమె బతికే ఉంది'

3 Dec, 2015 11:23 IST|Sakshi
'ఈ రోజుకీ ఆమె బతికే ఉంది'

లండన్: ఆ చిన్నారి పుట్టిన 74 నిమిషాలకే కన్నుమూసింది. ఆ కొద్ది నిమిషాల్లో ఒక మంచిపని చేసి అమరజీవిగా నిలిచిపోయింది. తాను చనిపోతూ అయవయదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించింది. బ్రిటన్ లో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ గా తన పేరు లిఖించుకుంది.
 

ఆ నవజాత ఆడశిశువు పేరు హోప్ లీ. గర్భంలో ఉండగానే ఆమె అమస్తిష్కత(అనిసెఫలే)తో బాధపడుతున్నట్టు హోప్ లీ తల్లిదండ్రులు ఎమ్మా, ఆండ్రూ గుర్తించారు. అమస్తిష్కత కారణంగా మెదడు, పుర్రే సరిగా అభివృద్ధి చెందవని, పుట్టిన తర్వాత ఆమె బతకదని వైద్యులు తెలపడంతో హోప్ లీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెను దిటువుచేసుకుని అవయవదానికి అంగీకరించారు.

కేంబ్రిడ్జి ఆస్పత్రిలో తన ట్విన్ సోదరుడు జోష్ కంటే రెండు నిమిషాలు ముందు పుట్టిన హోప్ లీ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. ఆమె మాత్రపిండాలను సేకరించి పెద్దాళ్లకు అమర్చారు. ఆమె కాలేయం నుంచి సేకరించి కణాలను భద్రపరిచారు. కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి వీటిని వినియోగించనున్నారు.

హోప్ లీ అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తమ గుండెలను పిండేసిందని, కానీ తప్పలేదని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. 'మరొకరికి అవయవాలు దానం చేయడం ద్వారా ఈరోజుకీ(హోప్) బతికేవుంది. తీవ్ర దుఃఖంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే హోప్ ద్వారా మరొకరికి ప్రాణదానం చేశామన్న సంతృప్తి మా బాధను కొంతవరకు తగ్గించింది' అని అన్నారు.

మరిన్ని వార్తలు