రాజధానిలో 8 ప్రత్యేక నగరాలు

10 Sep, 2015 01:10 IST|Sakshi
రాజధానిలో 8 ప్రత్యేక నగరాలు

5టీఎంసీల స్టోరేజీకి ప్రకాశం బ్యారేజీ పెంపు
గన్నవరం విమానాశ్రయంలో 16 పార్కింగ్ స్టాండ్లు
సీఆర్‌డీఏ సమీక్షలో చంద్రబాబు

 
విజయవాడ బ్యూరో: రాజధానిలో నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, జస్టిస్‌తోపాటు మరో నాలుగు నగరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజధాని వ్యవహారాలపై తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు. ఈ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.  సమీక్ష ముఖ్యాంశాలు ఇవీ..

రాజధానిలో 8 నగరాల ఏర్పాటు ప్రతిపాదనలకు కన్సల్టెన్సీలను నియమించుకోవాలి.{పస్తుతం 3టీఎంసీలున్న ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5టీఎంసీలకు పెంచేందుకు పరిశీలించాలి. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు జపాన్ వాణిజ్య శాఖా మంత్రి రానున్నారు.  రాజధాని ప్రాంతంలో 19,679 మంది కూలీలకుగాను 13,600 మందికి రూ.2,500 పెన్షన్ ఇస్తున్నారు. మిగిలిన వారికి త్వరలో ఇచ్చేయాలి.  మాస్టర్‌ప్లాన్‌కు డ్రాఫ్ట్‌ను రూపొందించాలి. ఈ పనిని 30రోజుల్లో పూర్తి చేయాలి.  గన్నవరం విమానాశ్రయంలో విమాన పార్కింగ్ స్టాండ్లను 16కు విస్తరించాలి.  ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జాతీయ రహదారికి వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలి. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసమీకరణను పూర్తి చేయాలి.

{బిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్(బీఐఏ) ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామి కావడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ స్ట్రేటజీ అధికారి షన్నన్‌మే బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.{పభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపును వేగవంతం చేయాలి. జవహర్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీదే ఈ బాధ్యత.     రాజధాని శంకుస్థాపన పైలాన్ ఏపీ ఆకాంక్షలకనుగుణంగా ఉండాలి. దీన్ని భవిష్యత్తులో పార్కుగా మార్చేలా చూడాలి.

 ఆకస్మిక తనిఖీలు చేస్తా : సీఎం
 అన్ని పట్టణాలు, నగరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం జరిగిన మున్సిపల్ కమిషనర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అన్ని నగరాలు, పట్టణాల్లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.దేశంలోని టాప్-100 మున్సిపాల్టీల్లో రాష్ట్రం నుంచి ఒక్క మున్సిపాల్టీకి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 సీఎంను కలిసిన జపాన్ బృందం
 రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటామని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్(జేబీఐసీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఈమేరకు వారు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.
 
ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్‌ను ప్రాధాన్యత రంగాలకు..

 కీలక రంగాల్లో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి విశ్లేషించే ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్‌ను ప్రాధాన్యత రంగాలకు వర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సమీక్షలో మాట్లాడారు.
 
 

మరిన్ని వార్తలు