అరుదైన ప్రేమకథ.. అతనికి 28, ఆమెకు 82

1 Mar, 2017 15:34 IST|Sakshi
అరుదైన ప్రేమకథ.. అతనికి 28, ఆమెకు 82

జకర్తా: ప్రేమకు కులం, మతం, ఎల్లలు ఉండవని అంటారు. ప్రేమ గుడ్డిది అని కూడా అంటారు. ఎవరి అభిప్రాయం వారిది. బహుశా ఇప్పటి వరకు ఎవరూ వినని కొత్త, వింతైన ప్రేమకథ ఇండోనేసియాలో వెలుగుచూసింది. 28 ఏళ్ల యువకుడు తనకంటే 54 ఏళ్లు పెద్దదైన 82 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ జంటను ఓ ఫోన్ కాల్ కలిపింది. ఇరు కుటుంబాల వారు షాకయినా ఈ ప్రేమ జంట (!) వివాహ బంధంతో ఒక్కటైంది.

మాంటెహేగ్‌కు చెందిన సోఫియన్ లోహో డాండెల్ (28)కు ఓ రోజు అపరిచిత వ్యక్తిని నుంచి ఫోన్ వచ్చింది. ఓ మహిళ మాట్లాడింది. ఆమెతో మాట్లాడిన తర్వాత పొరపాటున ఫోన్ చేసిందని తెలుసుకున్నాడు. ఇలా అనుకోకుండా వచ్చిన ఫోన్ కాల్ వీరిద్దరిని దగ్గరకు చేసింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో సోఫియన్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరి గురించి తెలుసుకున్నారు. అయితే ఆమె వయసు గురించి సోఫియన్ ఆరా తీయలేదు. కొన్ని నెలలు ఇలా గడిచిన తర్వాత సోఫియన్ తన ప్రేయసిని కలవాలని నిర్ణయించుకున్నాడు. 120 కిలో మీటర్ల దూరం ప్రయాణించి దక్షిణ మినహాసాలోని లీలెమా అనే గ్రామంలో ఉన్న ప్రేయసి దగ్గరకు వెళ్లాడు. తాను ప్రేమించిన మహిళ 82 ఏళ్ల వృద్దురాలని తెలుసుకున్న సోఫియన్ తొలుత షాకయ్యాడు. అయితే తమది నిజమైన ప్రేమని, కలసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. సోఫియన్ ప్రేయసి (!) పేరు మార్తా పొటు.

పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని సోఫియన్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే మార్తా వయసును చెప్పలేదు. పెళ్లి సంబంధం చూడటానికి వెళ్లిన సోఫియన్ కుటుంబ సభ్యులు మార్తాను చూసి షాకయ్యారు. తన కొడుకు ప్రేయసి వృద్దురాలని తెలుసుకున్న తర్వాత సోఫియన్ తల్లికి నోట మాట రాలేదు. చివరకు వాళ్ల ప్రేమకు అంగీకరించింది. ఈ నెల 18న సోఫియన్, మార్తా వివాహం చేసుకున్నారు. ఈ అసాధారణ ప్రేమ వివాహం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల కోసం ఆ జంట దగ్గరకు ఎగబడ్డారు. పదేళ్ల క్రితం తన భర్త చనిపోయాడని, వృద్దాప్యంలోకి తనకో తోడు కావాలని కోరుకున్నానని, సోఫియన్ రూపంలో ఓ తోడు దొరికిందని మార్తా చెప్పింది. ఆమె పిల్లలు జర్మనీ, సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు