గల్ఫ్ దేశాల్లో పనిచేయడం మనకు ప్రత్యక్ష నరకం

4 Aug, 2016 16:49 IST|Sakshi
గల్ఫ్ దేశాల్లో పనిచేయడం మనకు ప్రత్యక్ష నరకం

న్యూఢిల్లీ: పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయులు ఆ దేశాల్లో అనుభవిస్తున్న బాధలు అంతా ఇంతా కాదు. కొంత మంది ఉద్యోగాలు ఊడిపోయి ఆకలి మంటలతో అలమటిస్తుండగా, మరికొంత మంది అక్రమంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకొందరు అకాల మరణాలకు గురవుతున్నారు.  సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్ గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు ఏడాదికి 69 మంది అకాల మరణం పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మృతిసంఖ్య సగటున ఏడాదికి 26 ఉండగా, గల్ఫ్‌లోనే అత్యధికంగా ఉంది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ కార్మికులతో పోలిస్తే  సౌదీ అరేబియా, కువైట్‌లో చనిపోయే ప్రమాదం పది రెట్లు ఎక్కువగా ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సౌదీ, ఓమన్, కువైట్, యూఏఈ నివేదికల ప్రకారం ఆయా దేశాల్లో ప్రతి లక్ష మంది కార్మికుల్లో 65 నుంచి 75 మంది భారతీయులు మరణిస్తున్నారు.

 పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల వల్ల, పని ఒత్తిడిని తట్టుకోలేక వచ్చే గుండెపోటు వల్ల, ఉన్న ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడి పస్తులుండడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఆరు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల్లో 87 శాతం మంది తమ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ ఆయా దేశాల్లోని భారతీయ అంబసీలకు ఫిర్యాదు చేశారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖతార్‌లోని భారతీయ అంబసీకి 13,624 ఫిర్యాదులు, సౌదీ అరేబియాలో 11,195 ఫిర్యాదులు, కువైట్‌లో 11,103 ఫిర్యాదులు అందయాని భారత విదేశాంగ శాఖే ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది.

 జీతాలు చెల్లించక పోవడం, చెల్లించినా రావాల్సిన దానికన్నా తక్కువ చెల్లించడం, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం, ఎక్కువ పని గంటలు ఉండడం, ఎలాంటి సదుపాయాలులేని దుర్భర పరిస్థితుల్లో జీవించడం, భౌతికంగా హింసించడం, సకాలంలో వీసాలు, వర్క్ పర్మిట్ కార్డులు రిన్యువల్ చేయకపోవడం, వైద్య ఖర్చులు చెల్లించకపోవడం, కాంట్రాక్టు పీరియడ్ ముగిశాక మాతృదేశానికి విమాన టిక్కెట్లు ఇవ్వకపోవడం తదితర అంశాలపై ఈ ఫిర్యాదులు అందాయి.

 ప్రపంచవ్యాప్తంగా 7,213 మంది భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతుండగా, ఒక్క సౌదీ అరేబియాలోనే 1,697 మంది మగ్గిపోతున్నారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 1,143 మంది భారతీయులు జైళ్లలో మగ్గిపోతున్నారు. సకాంలో వీసాలను రిన్యువల్ చేయక పోవడం వల్ల, తిరుగు ప్రయాణంలో విమాన టిక్కెట్లు కొనుగోలుచేసే శక్తి లేకపోవడం వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక కంపెనీ నుంచి పారిపోవడం తదితర కారణాల వల్ల భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతున్నారు.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా