కోతి రగిల్చిన రణం.. 20 మంది మృతి

12 Dec, 2016 15:06 IST|Sakshi
కోతి రగిల్చిన రణం.. 20 మంది మృతి

లిబియాలోని సాభా నగరంలో ఒక వ్యక్తి కోతులు పెంచుతుంటాడు. ఆడపిల్లలు స్కూలు నుండి ఇంటికి వెళుతున్నపుడు వారిపై ఆ కోతులను ఉసిగొల్పి ఏడిపిస్తుంటాడు. అలా కొద్ది రోజుల కింద అతడి కోతి ఒకటి ఒక బాలిక చేతిని కొరికి ఆమె స్కార్ఫ్‌ను లాక్కెళ్లింది. దీంతో అక్కడ రెండు గిరిజన తెగల మధ్య పరువు యుద్ధం మొదలైంది. బాలిక కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. కానీ.. కోతి యజమాని నిరాకరించాడు. అతడికి అతడి తెగ మొత్తం అండగా నిలిచింది. దీంతో బాలికకు చెందిన తెగ వారు కూడా ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు ఈ రెండు తెగల మధ్య పూర్తి స్థాయి యుద్ధం సాగుతోంది.

సాభా నగరం నడి వీధుల్లో రాత్రీ పగలూ తేడా లేకుండా కాల్పులు జరుపుకుంటున్నారు. హోవిడ్జర్‌ ఫిరంగులు, మోర్టారులు కూడా వినియోగిస్తున్నారు. అర్థరాత్రిళ్లు సైతం రోడ్లపై యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నాయి. ఇప్పటివరకూ 20 మంది చనిపోగా, 60 మంది వరకూ క్షతగాత్రులయ్యారు. దీనిని కోతి యుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ యుద్ధానికి కారణమైన కోతి చనిపోయినట్లు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు