ఐజీకే షాకిచ్చిన ఆరేళ్ల పాప

29 Jun, 2017 23:27 IST|Sakshi
ఐజీకే షాకిచ్చిన ఆరేళ్ల పాప
మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మాన్వి అనే ఆరేళ్ల పాప పోలీసు అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా షాక్‌ ఇచ్చింది. తన తాత శాంతి స్వరూప్‌ వెంట పోలీసు ఉన్నతాధికారి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రామ్‌కుమార్‌ కార్యాలయానికి నేరుగా వెళ్లి తన అమ్మ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాల్సిందిగా కోరుతూ అందుకు లంచంగా తన కిడ్డీ బ్యాంకులోని డబ్బులు తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో ఐజీ కార్యాలయంలోని అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. రామ్‌కుమార్‌ మాన్వి తాత (తల్లికి తండ్రి) శాంతి స్వరూప్‌ను పిలిచి ఏమిటి విషయమని వాకబు చేశారు. 
 
ఆయన కథనం ప్రకారం మాన్వి తల్లి సీమా కౌషిక్‌కు ఏడేళ్ల క్రితం సంజీవ్‌ కుమార్‌ అనే యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లయిన నెల నుంచి మరింత కట్నం కావాలంటూ సంజీవ్, ఆయన ఇద్దరు సోదరులు, వారి తల్లి సీమను వేధించసాగారు. మూడేళ్లపాటు అష్టకష్టాలు అనుభవిస్తూ కాపురం నెట్టుకొచ్చిన సీమ, ఇక భరించలేక నాలుగేళ్ల క్రితం పుట్టింటికి పాపతో తిరిగొచ్చింది. అయినా అత్తింటి ఆరళ్లు ఆగలేదు. విలువైన నగలు, వస్తువులు ఎత్తుకొని పుట్టింటికి పారిపోయిందని, అత్తపై హత్యాయత్నానికి పాల్పడిందంటూ రెండు తప్పుడు కేసులు బనాయించారు. ఆ కేసులను కోర్టులు కొట్టివేశాయి. అయినప్పటికీ భర్త, అత్తింటి వేధింపులు ఆగకపోవడంతో సీమ గత ఏప్రిల్‌ నెలలో ఆత్మహత్య చేసుకొంది. అత్తింటి వేధింపులే కారణమంటూ ఆమె తండ్రి శాంతి స్వరూప్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు. భర్తతోపాటు ఆయన ఇద్దరు సోదరులు, తల్లిని నిందితులుగా చేర్చారు. 
 
భర్త సంజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇతర  నిందితులను అరెస్ట్‌ చేయలేదు. కేసు దర్యాప్తు కొనసాగించడం లేదు. ఇదే విషయమై శాంతి స్వరూప్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి దర్యాప్తు అధికారిని కలసుకున్నారు. ‘ఇక్కడ డబ్బులు లేకుండా ఎవరూ పనిచేయరు. వెళ్లి 50 వేల రూపాయలను తీసుకరా, అప్పుడే నిందితులపై చర్య తీసుకుంటాను’ అని సదరు దర్యాప్తు అధికారి స్వరూప్‌ను వెనక్కి పంపించారు. ఇంటికొచ్చిన స్వరూప్‌ జరిగిన విషయాన్ని కొడుకు రోహిత్, ఇతర కుటుంబ సభ్యులకు వివరించారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామని, కేసును మరచిపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. 
 
ఆ మాటలువిన్న మాన్వి తన కిడ్డీ బ్యాంక్‌ను తీసుకొచ్చి అందులోని మొత్తం డబ్బును తీసుకెళ్లి పోలీసులకు ఇమ్మని చెప్పిందట. ఈ విషయాన్ని రోహిత్‌ మీడియా ముందు చెప్పారు. ఆ మాటలు వినడంతో తనకు ఓ ఆలోచన వచ్చిందని, ఆ డబ్బులను ఐజీ తాతకు ఇద్దాంపదంటూ తండ్రి, మాన్వితో కలసి ఐజీ ఆఫీసుకు వచ్చామని రోహిత్‌ తెలిపారు. తమ మాటలకు స్పందించిన ఐజీ రామ్‌కుమార్‌ కేసు విచారణకు తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసు అధికారిని కూడా తప్పిస్తామని హామీ ఇచ్చారట. 
 
 
మరిన్ని వార్తలు