స్ప్రే కొడితే.. మీ వెంటే..

20 Jun, 2014 00:30 IST|Sakshi
స్ప్రే కొడితే.. మీ వెంటే..

వాషింగ్టన్: ఒకే ఒక్క స్ప్రే మీకు.. మీ పెంపుడు శునకానికి మధ్య బంధాన్ని మరింత పెంపొందిస్తుందట. హచ్ డాగ్ మాదిరిగా మీ వెంట పడేలా చేస్తుందట. టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా పిట్యుటరీ గ్రంధి నుంచి ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ విడుదలవుతుంది. అయితే దీనిని స్ప్రే రూపంలో రూపొందించి వివిధ జాతులకు చెందిన 16 పెంపుడు శునకాలపై పరిశోధనలు జరిపారు. తోటి శునకాలతో పాటు యజమానితో శునకాలు ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలించారు. అయితే ఆక్సిటోసిన్ స్ప్రే విడుదలైన తర్వాత శునకాల ప్రవర్తనలో చాలా మార్పు కనిపించిందట. యజమానిపై అమితమైన ప్రేమ కురిపించడం, ఉత్తేజంగా ఉండటం గుర్తించారు.

 

శునకాల గుండె వేగంలో మార్పులనూ గమనించారు. ఆక్సిటోసిన్ స్ప్రే శునకాల మెదడుపై పనిచేయడమే కాక ఆక్సిటోసిన్ వ్యవస్థను ఉత్తేజపరచినట్టు గుర్తించామని  పరి శోధనకు నేతృత్వం వహించిన మిహో నాగసావా వెల్లడించారు. అయితే ఈ స్ప్రేకు శత్రువులను మిత్రులుగా మార్చే సామర్థ్యం లేదని, కానీ స్నేహబంధాన్ని, కుటుంబ సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు