వాచీ కావాలా నాయనా?

2 Oct, 2015 11:17 IST|Sakshi
వాచీ కావాలా నాయనా?

చేతికి పెట్టుకునే వాచీని ఎంత పెట్టి కొంటారు? మామూలుగా అయితే కొన్ని వందలు.. అదే మీరు బాగా ముచ్చటపడి, ఏ పెళ్లికో.. లేదా ఇతర అకేషన్లకో అయితే కొన్ని వేలు పెట్టి కొంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న వాచీ కొనాలంటే మాత్రం లక్షలు కూడా చాలవు.. అక్షరాలా దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు వెచ్చించాలి! అలాగని ఇందులో ఏవైనా వజ్రాలు, రత్నాలు ఉన్నాయా అంటే అవీ లేవు. అయినా కూడా దాని ఖరీదు దాదాపు రూ. 5.50 కోట్లు. గ్రూబెల్ ఫోర్సీ క్వాడ్రాపుల్ టర్బిలిన్ అనే కంపెనీకి చెందిన ఈ వాచీలో కేవలం నాలుగంటే నాలుగే మోడళ్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఏడాదికి కేవలం ఐదు నుంచి ఆరు వాచీలను మాత్రమే తయారుచేస్తుందట. అయినా కూడా ఈ వాచీకి ఎందుకు అంత ధర పెట్టారో మాత్రం తెలియడంలేదు.

నిజానికి అంత మొత్తం వెచ్చిస్తే రోలెక్స్ కంపెనీకి చెందిన సబ్మెరైన్ అనే మోడల్ వాచీలు వంద వస్తాయి. అదే కాసియో జీ-షాక్స్ అయితే పదివేల వాచీలు వస్తాయి. ఇంకా మాట్లాడితే.. న్యూజెర్సీ శివార్లలో బ్రహ్మాండమైన 5 బెడ్రూంల ఇల్లు కూడా వచ్చేస్తుంది. అసలీ వాచీ ఎలా తయారు చేయాలన్న ఆలోచన ఫైనల్ కావడానికే ఐదేళ్లు పట్టిందని, ఇందులో నాలుగు టర్బిలిన్ కేజెస్ పెట్టామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దానివల్ల వాచీ పెర్ఫార్మెన్సు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి ఇలాంటి విశేషాలన్నీ ఉండబట్టే ఈ వాచీకి ఐదున్నర కోట్ల ధర పెట్టారన్నమాట.

మరిన్ని వార్తలు