నటుడి మృతిపై సీబీఐ దర్యాప్తు

18 May, 2017 15:27 IST|Sakshi
నటుడి మృతిపై సీబీఐ దర్యాప్తు

తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై ఏడాదిగా మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు సూచించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు వారం రోజుల క్రితం సీబీఐ నిరాకరించింది. దీంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు.

మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్‌ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్ట్టారు. సీఎం పినరయి విజయన్‌ కూడా సీబీఐ విచారణకు మొగ్గు చూపారు. అయితే దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ నిరాకరిచింది. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్‌ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు