రాహుల్పై ఆప్ నేత కుమార్ విశ్వాస్ పోటీ

11 Jan, 2014 15:00 IST|Sakshi
రాహుల్పై ఆప్ నేత కుమార్ విశ్వాస్ పోటీ

న్యూఢిల్లీ : ఢిల్లీని పదిహేనేళ్లపాటు పాలించిన షీలాదీక్షిత్ను మట్టికరిపించిన  ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై రణభేరి మోగించింది. లోక్సభ ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీపై పోటీకి దిగనున్నట్లు ఆప్ నేత కుమార్‌ విశ్వాస్‌ శనివారమిక్కడ వెల్లడించారు.

 

కుటుంబ రాజకీయాలకు బద్దలు కొట్టడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. ఒకవేళ రాహుల్ అమేధీ నుంచి  కాకుండా  మరెక్కడైనా పోటీ చేసినా.. తాను అక్కడే నిలబడతానని కుమార్ విశ్వాస్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తమకు అగ్గిపుల్లతో సమానమని ఆప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఈనేపథ్యంలో రాహుల్ నియోజకవర్గంలో ఇప్పటికే కుమార్ బిశ్వాస్ పర్యటించి....పరిస్థితిని సమీక్షించారు కూడా.

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్),  పార్లమెంటుపై గురిపెట్టింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు