ఇటు ఉద్విగ్నత.. అటు మీడియా హడావుడి

26 Nov, 2013 03:02 IST|Sakshi

ఘజియాబాద్: ఆరుషి హత్య కేసులో కోర్టు తీర్పు పురస్కరించుకుని పరిణామాలను కవర్ చేసేందుకు సోమవారం మీడియా పోటీలు పడింది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మీడియా ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు వద్ద మోహరించింది. అధిక సంఖ్యలో ప్రజలు సైతం తీర్పు వినేందుకు ఆసక్తి ప్రదర్శించారు. తీర్పు విన్నతర్వాత కుప్పకూలిపోయిన తల్వార్ దంపతులు కొద్దిసేపటికే తేరుకున్నారు. నూపుర్ తల్లిదండ్రులు సహా మిగతా కుటుంబసభ్యులు కూడా తల్వార్ దంపతులను ఓదార్చారు.

 

నూపుర్‌ను దస్నా జైలుకు తరలించేందుకు సిద్ధమైన మహిళా కానిస్టేబుళ్లు విలువైన వస్తువుల్ని బంధువులకు అప్పగించాల్సిందిగా ఆమెకు సూచించారు. ఓ వైపు సీబీఐ కోర్టులో తీర్పు ప్రకటన ప్రక్రియ, అనంతర పరిణామాలు కొనసాగగా కోర్టు బయట మీడియా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు గుమిగూడారు. భారీ బందోబస్తు ఉండటంతో కొందరు ఫొటో జర్నలిస్టులు చెట్లు, భవనాలపైకి ఎక్కి కోర్టు లోపలి దృశ్యాలను చిత్రించేందుకు యత్నించారు.

మరిన్ని వార్తలు