డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

23 Sep, 2015 01:09 IST|Sakshi
శ్రీధర్ నివాసంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు (ఇన్సేట్లో) డీఈ శ్రీధర్

రూ. 5 కోట్ల అక్రమ సంపాదన గుట్టురట్టు
హైదరాబాద్: కోట్లకు పడగలెత్తిన కరెంటు అధికారి అక్రమ సంపాదనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్, మరో 8 మంది అధికారులు మంగళవారం హైదరాబాద్ బల్కంపేటలోని అతడి ఇంటిలో సోదాలు చేశారు. అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి అతడి నివాసంతోపాటు బంధువులు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసి సుమారు రూ.5 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

బల్కంపేటలో విలువైన భవనం, నగరంలో మరో రెండు ఫ్లాట్‌లు, కరీంనగర్, సిరిసిల్లల్లో భవనాలు, 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు, ఆరు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డలో ఉన్న మేడ్చల్ విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్‌స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు