కలాం పార్టీ ఆవిర్భావానికి కసరత్తు

27 Feb, 2016 02:54 IST|Sakshi
కలాంతో పాన్రాజ్

భారత రత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భవించేనా..? అన్న ప్రశ్న రాష్ట్రంలో బయలు దేరింది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో ఆయన సహాయకుడు వి పొన్‌రాజ్ నిమగ్నమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
అభిప్రాయ సేకరణలో పొన్‌రాజ్

సాక్షి, చెన్నై : కలలు కనండి...వాటిని సాకరం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం పిలుపుకు స్పందించిన యువత రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు శాశ్వత నిద్రలోకి వెళ్లినా, ఆయన సందేశాలు, పిలుపు శాశ్వతం. ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకానికి అమితాభిమానం.

ఇదే అభిమానం ప్రస్తుతం రాజకీయ పయనానికి దారి తీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న ద్రవిడ పార్టీల పాలనకు చరమ గీతం పాడి మార్పునకు వేదికగా కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో అబ్దుల్ కలాం సహాయకుడు పొన్‌రాజ్ నిమగ్నమైనట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
కలాం పార్టీ : 
అబ్దుల్ కలాంకు సహాయకుడిగా ఏళ్ల తరబడి పొన్‌రాజ్ వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం కలాం మిషన్ ఇండియా ఇయక్కం ఏర్పాటు చేసి కలాం ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే, మరో సహాయకుడు ఆర్ సేతురామన్ యునెటైడ్ 2020 ఇయక్కంతో ముందుకు సాగుతున్నారు. కలాం కలల సాకారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఇయక్కంలను రాజకీయ పార్టీగా మార్చేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో విరుదునగర్ వేదికగా యువత, విద్యార్ధి, పట్టభద్రులు ఏకమై సమావేశంలో అభిప్రాయల సేకరణలో పడ్డారు.

కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి తగ్గ కసరత్తుల్లో నిమగ్నం అవుతూ ఈ అభిప్రాయ సేకరణ సాగుతుండటం గమనార్హం. ఈ విషయంగా పొన్‌రాజ్‌ను ఓ మీడియా కదిలించగా, కలాం ఆశయ సాధనకు ఓ వేదికగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. యువత, విద్యార్థి లోకం, పట్టభద్రులు మార్పును ఆశిస్తున్నారని, కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అయితే, రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ దిశగా అడుగులు మాత్రం వేసి ఉన్నామని చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు