ఈమె మామూలు మహిళ కాదు!

12 Aug, 2016 14:24 IST|Sakshi
ఈమె మామూలు మహిళ కాదు!

'ఫిమేల్ ఇండియానా జోన్స్' పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ, అలిసన్ టీల్? తెలియదంటే మాత్రం కొద్దోగొప్పో మిస్ అయినట్టే! 30 ఏళ్ల ఈ మిస్.. సామాన్య మహిళ కాదు.. అడ్వెంచరిస్టులకే  అమ్మమ్మ లాంటిది! పుట్టడంతోటే ప్రపంచ బాట పట్టిన ఈ హవాయిన్ పడతి ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టొచ్చింది. చుట్టిరావడమంటే కేవలం చూసి రావడంకాదు, అక్కడి సంసృతి, జీవన విధానం, ప్రకృతి రహస్యాలు మొదలైన అంశాలను లోతుగా అధ్యయనం చేసి, ఆ వివరాలు మనకు తెలియజేస్తుంది.

'ఇండియానా జోన్స్'లో హారిసన్ ఫోర్డ్ కు టోపి, తాడు ఎలానో.. ఈ 'ఫిమేల్ ఇండియానా' అలిసన్ కు సర్ఫ్ బోట్ అలా. ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో సర్ఫింగ్ చేసిందీమె. మరో అడ్వెంచరిస్ట్ తో కలిసి అలిసన్ చేసిన సాహసాలు 'నేక్డ్ అండ్ అఫ్రైడ్' పేరుతో డిస్కవరీ చానెల్ లో ప్రసారం అయ్యాయి. ఆ కార్యక్రమం ఓ సంచలనం. ఇప్పటివరకు తాను  చేసిన సాహసయాత్రలపై 'అలిసన్ అడ్వెంచర్స్' పేరుతో ఫిలిం సిరీస్ ను కూడా రూపొందించింది.

తాజాగా అలిసన్.. హవాయి ద్వీపాల్లోని కిలాయే అగ్నిపర్వతం దగ్గర (ఫసిఫిక్ సముద్రంలో) సర్ఫింగ్ చేసింది. 2011లో బద్దలైన ఆ అగ్నిపర్వతం నుంచి ఐదేళ్లుగా లావా ప్రవహిస్తూనేఉంది. లావా సముద్రంలో పడే చోట సర్ఫింగ్ చేసి 'వాహ్వా' అనిపించింది. ప్రపంచ చరిత్రలో ఇలా లావాకు సమీపంలో సర్ఫింగ్ చేసిన మొదటి మహిళగా రాకార్డుకెక్కింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ పెరిన్ జేమ్స్ ఈ కృత్యాన్ని తన కెమెరాతో అద్భుతంగా చిత్రీకరించాడు. 'అదొక అద్భుత దృశ్యం. లావా సముద్రంలో పడుతున్నప్పుడు వచ్చే శబ్ధం నిజంగా మనల్ని భయపెడుతుంది. అక్కడ నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి. సాహసాలు చేయడం నాకు అలవాటు కాబట్టి నేనిది చేశా. దయచేసి ఎవ్వరూ ఇలాంటివి చేయకండి' అని చెబుతోంది అలీసన్.



ప్రముఖ అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ బ్లెహెర్ట్.. అలిసన్ తండ్రి. తల్లి పేరు దెబోరా. అడ్వెంచర్లు చేస్తూ ప్రపంచం తిరిగే వీరు.. కూతుర్ని(అలిసన్) కూడా వెంటతీసుకెళ్లేవారు. అలా ప్రపంచమే నా పాఠశాల అయిందని, ప్రకృతి, విభిన్న సంస్కృతుల ప్రజలే తన గురువులని చెబుతుందీ డేర్ డెవిల్. అలిసన్ టీల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలకు ఆమె వెబ్ సైట్ alisonsadventures.com ద్వారా తెలుసుకోవచ్చు. అలీసన్ జీవితం, ఆమె వీడియోల్సి చూశాక భూమ్మీద మనుషులు ఇలా కూడా బతుకుతారని, ఎక్కడైనాసరే బతుకు భారమేమీ కాదని అనిపించకమానదు!