పండుగనాడు ఆ రెండు సినిమాలు తుస్..

31 Oct, 2016 18:13 IST|Sakshi
పండుగనాడు ఆ రెండు సినిమాలు తుస్..

ముంబై: మత్తెక్కించే రొమాంటిక్ సీన్లు, ప్రేమ, వైఫల్యాలు, గాఢమైన అనుబంధాలు కలబోసిన సినిమా ఒకటి. భారీ యాక్షన్ సీన్లు, హిమాలయాల్లో సాహసాలు, కూతురి సెంటిమెంట్ తో తెరకెక్కిన మరో సినిమా. దీపావళి సందర్భంగా విడుదలైన రెండు భారీ బాలీవుడ్ సినిమాలు 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నాయి. పండుగను క్యాష్ చేసుకోవడంలో రెండు సినిమాలూ విఫలమయ్యాయని, దీంతో ఫ్యాన్సీ రేట్లకు సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలిందని సోమవారం బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి.

అక్టోబర్ 28న విడుదలైన 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు తొలిరోజు వరుసగా రూ.13.30 కోట్లు, రూ.8.26కోట్ల వసూళ్ల(గ్రాస్)ను రాబట్టాయి. రెండో రోజు, అంటే శనివారం 'ఏ దిల్'కు రూ.13.10కోట్లు, 'శివాయ్'కు 10.06కోట్లు వసూలయ్యాయి. కానీ కీలకమైన దీపావళి (ఆదివారం)పండుగ నాడు మాత్రం రెండు సినిమాల కలెక్షన్లు పడిపోయాయి. దీపావళినాడు 'ఏ దిల్' 9.20 కోట్లు, 'శివాయ్' రూ.8.26 కోట్లు మాత్రమే వసూలు చేశాశాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు.

ఇండియాలో 3000 స్క్రీన్లపై విడుదలైన 'ఏ దిల్'కు విదేశాల్లో మంచి స్పందన లభించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.40.05 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు 'ఏ దిల్'.. 2016 సంవత్సరంలో విదేశాల్లో  భారీ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిందని రూపకర్తలు ప్రకటించారు. 'ఏ దిల్..' అమెరికాలో 2.1 మిలియన్ డాలర్లు, బ్రిటన్, ఆస్త్రేలియాల్లో వరుసగా 752,000 డాలర్లు, 307,045 డాలర్లు వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. అయితే సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ అన్నారు.

మరిన్ని వార్తలు