పాక్‌పై నిప్పులు చెరిగిన ఆఫ్ఘాన్‌‌..

22 Sep, 2017 16:34 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ తీవ్రవాదులకు డెన్‌గా మారిందని ఆఫ్ఘానిస్తాన్‌ ఆరోపించింది. తీవ్రవాద సంస్థలు, గ్రూపులను  పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌..  అదుపు చేయటంలో ఘోరంగా విఫలమైందని తెలిపింది. దీనిని మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగింది. తమ దేశంలో తీవ్రవాద సంస్థలు కొనసాగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆ దేశ ప్రతినిధి అన్నారు. పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో కొనసాగుతున్న తీవ్రవాద సంస్థల చర్యలు తమ దేశంతోపాటు, ఈ ప్రాంత భద్రతకు ప్రమాదకరంగా మారయని ఆయన ఆందోళన  వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ ముందు మరో అవకాశం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుని తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కోరారు. తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఆఫ్ఘానిస్తాన్‌తోపాటు ఈ  ప్రాంతంలో శాంతి సుస్థిరతకు కలిసిరావాలని కోరారు. సంప్రదింపులు, చర్చల ద్వారా తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షహీద్‌ ఖాతాన్‌ అబ్బాసీ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. తీవ్రవాద సంస్థ తాలిబాన్‌ తమ దేశంలో లేనే లేదని, అఫ్ఘానిస్తాన్‌లోనే దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తిప్పికొట్టారు. పొరుగు వారిని విమర్శించే ముందు తమ దేశంలో మాదకద్రవ్యాల సాగు, తీవ్రవాద ముఠాల కార్యకలాపాలను అడ్డుకోవాలని ఆయన అఫ్ఘానిస్తాన్‌ను కోరారు.                
                    

మరిన్ని వార్తలు