ఉగ్రవాదులపై పోరాటానికి మహిళా ఫైటర్లు

2 Jan, 2017 16:03 IST|Sakshi
ఉగ్రవాదులపై పోరాటానికి మహిళా ఫైటర్లు

కాబుల్‌: తాలిబన్‌, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల దాడులతో అఫ్ఘానిస్థాన్‌ అట్టుడికిపోతోంది. తాలిబన్ల వల్ల గతంలో చాలా నష్టపోయింది. అఫ్ఘాన్‌లో ప్రజాసామ్య ప్రభుత్వం ఏర్పడినా ఉగ్రవాద ముప్పు తప్పలేదు. ఉగ్రవాద దాడులతో విసిగిపోయిన ప్రజలు వారిపై తిరగబడుతున్నారు. విశేషమేంటంటే ఆ దేశంలోని ఉత్తరాదిన ఉన్న జవ్‌జ్జాన్‌ ప్రావిన్స్‌లో తాలిబన్లు, ఐఎస్‌ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు ముందుకు వస్తున్నారు.

ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా మహిళలు ఆయుధాలను చేతపట్టారు. అత్యాధునిక రైఫిల్స్‌ను కాల్చడంలో శిక్షణ పొందారు. ఆయుధాలు చేతపట్టిన మహిళల ఫొటోలు సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాటానికి మహిళలను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు. తాలిబన్ల స్వాధీనం కాకుండా తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు జర్మీనా (53) అనే మహిళ కమాండెర్‌ సారథ్యంలో మహిళలు పోరాడుతున్నారు. ఆమె నేతృత్వంలో 45 మంది మహిళా ఫైటర్లు పనిచేస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలు వారిపై పోరాటానికి ఆయుధాలు చేతపడుతున్నారు. 2014లో ఓ అఫ్థాన్‌ మహిళ తన కొడుకు హత్యకు ప్రతీకారంగా 25 మంది తాలిబన్‌ ఉగ్రవాదులను చంపేసింది.

మరిన్ని వార్తలు