రిజర్వేషన్లపై సమీక్ష అవసరం లేదు

23 Sep, 2015 01:24 IST|Sakshi
రిజర్వేషన్లపై సమీక్ష అవసరం లేదు

భాగవత్ వ్యాఖ్యలపై దుమారం నేపథ్యంలో కేంద్రం వెల్లడి
ఈ వివరణ నామమాత్రమేనని లాలూ, నితీశ్ మండిపాటు
ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ ఒక ముసుగని విమర్శ
రిజర్వేషన్లకు తూట్లు పొడిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు: మాయావతి
దళితులను తిరిగి చీకటి యుగంలోకి పంపే కుట్ర అని ఆరోపణ
ఆర్‌ఎస్‌ఎస్‌ది విభజన రాజకీయం: సురవరం

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండడంతో కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని తిరిగి సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ కేంద్రం వివరణ నామమాత్రమేనని..ఆర్‌ఎస్‌ఎస్‌ను కాదనే దమ్ము బీజేపీకి లేదని ఆర్జేడీ, జేడీయూ విమర్శించాయి. బిహార్ ఎన్నికల నేపథ్యంలోనే అలా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఇక ఈ అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల విధానానికి తూట్లు పొడిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
 
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని.. రిజర్వేషన్లను సమీక్షించాల్సి ఉందని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఎవరికి ఎంతకాలం కోటా విధానం అవసర మో పరిశీలించేందుకు రాజకీయేతర కమిటీని ఏర్పాటు చేయాలనీ సూచించారు. దీనిపై కాం గ్రెస్, ఆర్‌జేడీ, జేడీయూ, బీఎస్పీ సహా విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి.

రిజర్వేషన్లకు తూట్లు పొడవాలని చూస్తే ఎన్డీయే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుం దని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ‘ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలనే ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు.. రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఆర్థిక, విద్యా, సామాజిక పరమైన అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం. వాటిని సమీక్షించాల్సిన అవసరం లేదు..’ అని పేర్కొన్నారు.
 
ఆందోళనలు చేపడతాం..
రిజర్వేషన్ల విధానంలో ఎలాంటి మార్పులు చేసే యత్నం చేసినా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ‘‘ఒకవేళ మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే.. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వంపై పోరాడుతాం..’’ అని ఆమె పేర్కొన్నారు. దళితులను తిరిగి చీకటి యుగంలోకి నెట్టివేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక మోహన్ భాగవత్ వ్యాఖ్యల అంశంపై దూరంగా వ్యవహరించాలన్న బీజేపీ వైఖరి రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ విమర్శించారు.

రిజర్వేషన్లకు గండి కొట్టాలన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ ముసుగు అని, ఆర్‌ఎస్‌ఎస్‌ను కాదనే ధైర్యం బీజేపీకి ఎక్కడుందని లాలూ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో ఇబ్బంది ఎదురవుతుందనే భాగవత్ వ్యాఖ్యల పట్ల బీజేపీ అంటీ ముట్టనట్లుగా ఉంటోందని చెప్పారు.

ఇక ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగమే బీజేపీ అని, వారి సిద్ధాంతాలే వీరి సిద్ధాంతాలని నితీశ్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకే రిజర్వేషన్లను సమీక్షించాలని భాగవత్ వ్యాఖ్యలు చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. ఇలాంటి విభజన రాజకీయాల పట్ల, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజా వ్యతిరేక చర్యల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
సమర్థించిన వీహెచ్‌పీ..
మరోవైపు విశ్వహిందూ పరిషత్  మోహన్ భాగవత్‌ను సమర్థించిం ది. ఇంకా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందాల్సిన అవసరమున్న కులాలు ఏమై నా ఉన్నాయా? అనేది తేల్చేందుకు న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్ కేంద్రానికి సూచించారు. ‘భాగవత్ సూచించిన దానిలో కొత్త అంశమే మీ లేదు.

రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే పదేళ్ల తర్వాత రిజర్వేషన్లను సమీక్షించాలని దాని రూపకర్తలే పేర్కొన్నారు.  కాబట్టి ఆయా కులాలకు ఇంకా రిజర్వేషన్లను వర్తింపజేయాల్సిన అవసరం ఉందా అనేది పరిశీలించాలి. దీనిపై ప్రభుత్వం న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం..’అని ఆయన అన్నారు. రిజర్వేషన్లపై భాగవత్ సూచనను పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు