నేడు జల్లికట్టు రేపు ఎడ్ల బండ్ల పోటీలు..

21 Jan, 2017 14:23 IST|Sakshi
నేడు జల్లికట్టు రేపు ఎడ్ల బండ్ల పోటీలు..
జల్లికట్టును అనుమతించాలంటూ తమిళులు ఉప్పెనలా సాగిస్తున్న ఆందోళన ఇంకా అలాంటి ఉద్యమాలకు స్ఫూరినిస్తోంది. జల్లికట్టుతో పాటు 2014లోనే సుప్రీంకోర్టు నిషేధించిన ఎడ్లబండ్ల పోటీల పునరుద్ధరనకు తామూ భారీ ఎత్తున ఆందోళన చేపడతామని శివసేన తాజాగా ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు వల్లే అసోంలో నిలిచిపోయిన బుల్‌ బుల్‌ పిట్టల పోటీలను అనుమతించేందుకు తాము కూడా ఆందోళన బాట పడతామని ఆ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. 
 
గణేష్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా నిర్వహించే పుణె ఫెస్టివల్‌లో ఎడ్ల బండ్ల పందేలను ఏటా నిర్వహించేవారు. దాదాపు 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పోటీలను జల్లికట్టుతోపాటు సుప్రీంకోర్టు నిషేధించింది. అప్పటినుంచి అక్కడ ఈ పోటీలను నిర్వహించడం లేదు. ఇప్పుడు సంప్రదాయ క్రీడను రక్షించుకునేందుకు తమిళులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమ సంప్రదాయ పోటీలైన ఎడ్ల పందేలను రక్షించుకునేందుకు తాము ఆందోళనకు దిగుతామని శివసేన హెచ్చరించింది. అయితే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత తాము ఈ ఆందోళన చేపడతామని ఆ పార్టీ ప్రకటించింది. 
 
మన మకర సంక్రాంతి సమయంలోనే అసోం ప్రజలు ‘భోగాలి బిహు’ పేరిట పంటల పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా, ముఖ్యంగా అసోంలోని హజో పట్టణంలో బుల్‌ బుల్‌ పిట్టల మధ్య కోడిపందేల మాదిరి పోటీలను నిర్వహిస్తారు. రెండు పిట్టల కాళ్లకు తాళ్లు కట్టి వాటిని ఓ టేబుల్‌పై పరస్పరం కొట్టుకు చచ్చేలా పోటీ పెడతారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఆశ చూపి అవి కొట్టుకునేలా చేస్తారు. ఈ పోటీల్లో ఒకసారి ఒకటి, ఒక్కోసారి రెండు పిట్టలు చనిపోతాయి. ఆ పిట్టల గెలుపోటముల మధ్య ప్రజలు పందెం కాస్తారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగానే నిలిచి పోయిన ఈ పోటీల అనుమతి కోసం తామూ ఆందోళన చేస్తామని అసోం ప్రజలు అంటున్నారు.