మళ్లీ ‘స్విస్‌ చాలెంజ్‌’ టెండర్‌

5 Jan, 2017 00:30 IST|Sakshi
మళ్లీ ‘స్విస్‌ చాలెంజ్‌’ టెండర్‌

గతంలో సింగపూర్‌ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలు
కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏపీఐడీఈ చట్టాన్నే మార్చిన ప్రభుత్వం
అందుకనుగుణంగా కొత్తగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సీఆర్‌డీఏ
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఫిబ్రవరి 21 వరకూ టెండర్ల దాఖలు గడువు


సాక్షి, అమరావతి:  వివాదాస్పదమైన రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) స్విస్‌ చాలెంజ్‌ విధానంలో మళ్లీ టెండర్లు పిలిచింది. గతంలో పిలిచిన టెండర్‌పై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగడంతోపాటు కోర్టులోనూ సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఎత్తులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా ఏపీఐడీఈ చట్టాన్నే మార్చేసింది. దానికనుగుణంగా తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. రెండురోజుల క్రితమే దీనిపై ఒక జీఓను సైతం విడుదల చేసింది.

నిబంధనలన్నీ సింగపూర్‌ కంపెనీలకే అనుకూలం
6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెమ్‌కార్ప్‌ లిమిటెడ్‌ కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. దీన్ని ఆమోదించిన ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అంతకంటే మెరుగైన ప్రతిపాదనల కోసం మూడు నెలల క్రితం అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. అయితే, ఈ టెండర్‌ నిబంధనలన్నీ సింగపూర్‌ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. లోపాయికారీగా సింగపూర్‌ కన్సార్టియంకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం తూతూమంత్రంగా ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి సిద్ధమైంది.

అధికారాలన్నీ సాంకేతిక కమిటీకే..
ప్రభుత్వానికి నష్టం కలిగేలా, దేశీయ కంపెనీలకు ఏమాత్రం అవకాశం లేనివిధంగా ఉన్న టెండర్‌ నిబంధనలను ఆదిత్య ఇన్‌ఫ్రా కంపెనీ హైకోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టులో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలో కీలకమైన ఆదాయ వాటాను ఎందుకు వెల్లడించలేదనే దానికి సమాధానం చెప్పలేకపోయింది. చేసిన తప్పులన్నీ బయటపడిన తర్వాత చేసేది లేక ఏపీఐడీఈ చట్టాన్ని మార్చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలు, అందులోని లోపాలపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా చివరికి సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేయించారు.

కానీ తీరా కోర్టులో తలబొప్పి కట్టడంతో అక్కడ బయటపడిన లోపాలు, సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ అధికారాలన్నీ కత్తిరించేలా చట్టంలో మార్పులు చేశారు. దీనిప్రకారం అధికారాలన్నీ సీఆర్‌డీఏ నేతృత్వంలోని సాంకేతిక కమిటీకి కట్టబెడుతూ తాజాగా జీఓ విడుదల చేశారు. అందుకనుగుణంగా సీఆర్‌డీఏ సోమవారం అర్ధరాత్రి స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రెండు దశల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. తొలి దశలో వచ్చిన దరఖాస్తులన్నీ నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించి అర్హతలు సాధిస్తే రెండో దశకు ఎంపిక చేస్తామంది. రెండో దశకు అర్హత సాధించిన కంపెనీలకు సింగపూర్‌ కన్సార్టియం తన ప్రతిపాదనలో పేర్కొన్న ఆదాయ వాటాను వెల్లడిస్తామని తెలిపింది. ఆసక్తి గల సంస్థలు ఫిబ్రవరి 21లోపు ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ సెట్‌లో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయాలంది. ఈ నెల 6న ఇదే వెబ్‌సైట్‌లో పూర్తి టెండర్‌ డాక్యుమెంట్, ప్రాజెక్టు వివరాలు  ఉంటాయంది. 

మరిన్ని వార్తలు