-

సారా అమ్మకాలపై సమరభేరి

10 Aug, 2015 16:56 IST|Sakshi

ఆమనగల్లు (మహబూబ్‌నగర్ జిల్లా): ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో అక్రమ సారా అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సారాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, యువజన సంఘాలతో పాటు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సారా, బెల్ట్‌షాపుల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు.

శ్రీశైలం-హైద్రాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, గ్రామంలో నాటుసారా సేవించి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని, గ్రామంలో నాటు సారా అమ్మకందారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సారా మహమ్మారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు ఏర్రోళ్ల రాఘవేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంకి శ్రీను, అంజి, రాఘవేందర్, నాయకులు మహేశ్, రమేశ్, వినోద్, బిక్షపతి, రాము, రాజు,శీరీషా,మనీషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు