ప్చ్..‘పప్పులు’ పండడం లేదు..!

22 Jan, 2016 02:12 IST|Sakshi
ప్చ్..‘పప్పులు’ పండడం లేదు..!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పాదకత భారీగా పడిపోయింది. దేశ సగటుతో పోల్చినా... ఇతర రాష్ట్రాల ఉత్పాదకతతో బేరీజు వేసినా ఇక్కడ బాగా తక్కువగా  ఉందని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. దిగుబడి లేక వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు.  వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగుకు ఆసక్తి చూపుతున్నారని జాతీయ ఆహార భద్రత మిషన్ అంచనా వేసింది. ఇది రాబోయే రోజుల్లో పప్పుధాన్యాల కొరతకు దారి తీస్తుందని  శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
 
హరియాణాతో పోల్చితే సగానికంటే తక్కువ...
ప్రపంచంలోనే మన దేశం పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ ముందు వరుసలో ఉంది. దేశ అవసరాలకు 220 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా... భారత్‌లో పండించేది 197.8 లక్షల మెట్రిక్ టన్నులే. మిగిలినది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2050 నాటికి 500 లక్షల మెట్రిక్ టన్నులు  దేశ వినియోగానికి అవసరమని జాతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థ అంచనా. జనాభా పెరుగుతుండటం, ఆ ధాన్యాల్లో అధిక పోషక విలువలు, మాంసకృత్తులు ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ఉత్పాదకత లేక  కొరత ఏర్పడే ప్రమాదముంది.

తెలంగాణలో 2014 లెక్కల ప్రకారం 14 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగ్గా... ఏడాదికి 4.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 73 శాతం రబీ సీజన్‌లోనే సాగవుతోంది. తెలంగాణలో వీటి సాగుకు అత్యంత అనుకూల పరిస్థితి ఉన్నా  రైతులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ఇక హరియాణా రాష్ట్రంలో హెక్టారుకు 1,764 కిలోల పప్పుధాన్యాల ఉత్పాదకత ఉండగా... మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లోనూ 1000 నుంచి 1100 కిలోల వరకు దిగుబడి వస్తోంది. కానీ తెలంగాణలో కేవలం 774 కిలోలే ఉత్పాదకత వస్తోంది. ముఖ్యమైన కందిపప్పు ఉత్పాదకత హెక్టారుకు 517 కిలోలే . మినప పప్పు 637 కిలోలు, పెసర పప్పు 764 కిలోలే .
 
రబీలో భూములు పడావు...
వాణిజ్య పంటలు లేదా వరి వంటి వాటి పైనే రైతులు దృష్టిసారిస్తున్నారు. రబీలో కూడా వరి వేసే పరిస్థితి లేకపోతే భూమిని ఖాళీగా వదిలేస్తున్నారే గానీ పప్పుధాన్యాల వైపు రైతులు మరలడం లేదని జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పప్పుధాన్యాల వైపు రైతులను మరలిస్తే సాగు విస్తీర్ణతకు అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి వీలుంది.

తక్కువ దిగుబడి రావడం, కనీస మద్దతు ధరలు లేకపోవడం వల్ల కూడా రైతులు ఈ పంట పట్ల ఆసక్తి చూపడంలేదని జాతీయ సర్వేలు చెప్తున్నాయి. అయితే పండించాక నిల్వకు అవకాశాలు లేకపోవడంతో పురుగుపట్టడం తదితర కారణాలతో 9 శాతం పప్పుధాన్యాలు వృథా అవుతున్నాయని ఆ సర్వేల కథనం. దాల్ మిల్లుల పరిశ్రమ పరంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచినా పప్పుధాన్యాల సాగుపై ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. దీనిపై ఇప్పటికైనా వ్యవసాయశాఖ దృష్టిసారించి రబీలో పప్పుధాన్యాల సాగువైపు రైతులను మరలించేలా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు