అగస్టా స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం

20 Jun, 2016 17:30 IST|Sakshi

న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈడీ సోమవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలతో పాటు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈడీ ఏయే సంస్థలపై సోదాలు నిర్వహించిందనే దానిపై వివరాలను గోప్యంగా ఉంచింది. మరోవైపు అగస్టా కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇప్పటికే దుబాయి, మారిషస్, సింగపూర్లో ఆ సంస్థ కంపెనీలపై సోదాలు నిర్వహించి రూ.86.07 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది.

కాగా అగ‌స్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాఫ్టర్ కుంభకోణంపై బుధవారం ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి మధ్యవర్తిగా వ్యవహరించిన  క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసింది. దేశ‌ంలో పెను దుమారం రేపిన రూ. 3,600 కోట్ల లావాదేవీకి సంబంధించిన అగ‌స్టా మ‌నీల్యాండరింగ్ కేసులో క్రిస్టియ‌న్ మైఖేల్ మ‌ధ్యవర్తి అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు